ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలో కొంతమంది యువకులు సాగుమీద దృష్టిపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చేసే పనే అదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వీరంతా నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు.., చదువుకుంటున్నవారు కావడం విశేషం. కరోనా లాక్‌డౌన్ వల్ల వీరి పరిస్థితి తలకిందులయ్యింది. ఉద్యోగాలు కోల్పోయినవారు కొందరయితే.., కళాశాలలు తెరవకపోవడంతో ఖాళీగా ఉన్నవారు మరికొందరు. వీరందరూ సాగు మీద దృష్టి పెట్టారు. అందరూ చేసేలా కాకుండా పెట్టుబడి లేకుండా చేయాలన్నది వీరి ప్రధాన లక్ష్యం. రసాయనాలు వినియోగించడం వల్ల కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశ్యంతో ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిపెట్టారు.
గ్రామానికి చెందిన నూతక్కి వెంకటేశ్ బీఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కరోనా లాక్‌డౌన్‌తో ఉద్యోగాన్ని వదిలి ఇంటికి రావాల్సి వచ్చింది. వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల జరిగే నష్టం వెంకటేశ్‌ను ఆలోచనలో పడేసింది. లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి రసాయనక ఎరువులు వినియోగించుకుండా సాగుచేయాలని భావించాడు. తన మిత్రులు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న నర్రా బ్రహ్మసాయి, బీబీఏ చదువుతున్న సందీప్‌లతో తన ఆలోచనలు పంచుకున్నాడు. తనకు సొంత పొలం లేకపోయినా.., తన మిత్రుడు పొలంలో అర ఎకరా స్థలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు ప్రారంభించాడు.గోమూత్రం, జీవామృతం వంటివి మాత్రమే వినియోగించి సాగు చేయటం మెుదలు పెట్టారు. చిన్న చిన్న మడులుగా విడగొట్టి తోటకూర, పాలకూర, చుక్క కూర వంటి ఆరు రకాల ఆకుకూరలు సాగు చేయగా మంచి దిగుబడి వచ్చింది.