YCP Govt Not Care Farmers: ఇటీవల మాండౌస్ తుపాను కారణంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తుపాను కారణంగా అన్నదాత నిండా మునిగాడు.. ఇదే సమయంలో సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలతో పార్టీ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ సాధించాలని.. దీని కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. అయితే.. కష్టాల్లో మునిగిన రైతుకు అండగా నిలవాలని, ఓదార్పు ఇవ్వాలనే సూచనలు సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు చేయలేకపోయారు. ముఖ్యమంత్రి సహా అధికశాతం మంత్రులు, ఎమ్మెల్యేలంతా దెబ్బతిన్న పొలాల పరిశీలనకు వెళ్లాలని యోచించలేకపోయారు. కొందరు పొలాల్లోకి వెళ్లినా.. అదీ తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. తూతూ మంత్రంగా పంట నష్టం గణన సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని 35 మండలాల్లోని 510 గ్రామాల్లో 67 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. పొగాకు రైతులు ఎకరానికి రూ.25వేలకు పైగా పెట్టుబడుల్ని కోల్పోయారు. మినుము, ఇతర పంటలూ దెబ్బతిన్నా.. అక్కడి మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎక్కడా కన్పించలేదు. పొలాలెలా ఉన్నాయో.. రైతుల ఇబ్బందులేమిటో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. తర్లుపాడు మండలంలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తన నియోజకవర్గ పరిధిలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రతిపక్ష టీడీపీకు చెందిన కొందరు నాయకులు రైతుల్ని పరామర్శించి అండగా నిలుస్తున్నారు.
చిత్తూరు జిల్లాపైనా తుపాను ప్రభావం అధికంగా ఉంది. వరితో పాటు ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగింది. కుప్పం, పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లో రైతులు దెబ్బతిన్నారు. అయినా ఆ జిల్లాకు చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా ఎక్కడా పరామర్శించిన దాఖలాలే లేవు. సొంత జిల్లాలో రైతులు అల్లాడుతున్నా.. మంత్రి పెద్దిరెడ్డి మాత్రం తాను ఇన్‌ఛార్జిగా ఉన్న అనంతపురం జిల్లాలో సమీక్షలే ముఖ్యం అన్నట్లుగా ఉన్నారు. కొందరు జిల్లాస్థాయి నాయకులు, అధికారులు మాత్రమే పొలాలను పరిశీలించారు.