Pending Bill Payments: మున్సిపాలిటీలోని వార్డులకు నీటిని సరఫరా చేసిన.. బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అప్పులపాలైనట్లు ప్రకాశం జిల్లా కనిగిరి 3వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పెన్నా నాగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.తనకున్న ఎకరా పదిహేను సెంట్ల పొలాన్ని అమ్మివేసి.. నీటి సరఫరా కోసం చేసిన సగం అప్పులు తీర్చినట్లు ఆమె తెలిపారు. ఇంకామిగిలిన అప్పుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని నాగమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
కనిగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ తరఫున మూడో వార్డు కౌన్సిలర్‌గా నాగమ్మ అనే మహిళ పోటీ చేసి గెలిచింది. ఏడాది పాటు మున్సిపాలిటీలోని వార్డులకు ఆమె నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. అందుకోసం కోటిన్నర ఖర్చు చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఆమె తన వార్డులో రోడ్డుకు కల్వర్టు కూడా నిర్మించి అందుకు మూడు లక్షలు ఖర్చు చేశారు. అయితే ప్రభుత్వం ఆమెకు బిల్లులను చెల్లించలేదు. దీంతో ఆమె.. తన భర్త సంపాదించిన ఒక్కగానొక్క ఎకరం పొలాన్ని అమ్మివేసి కొంతమేర అప్పులు తీర్చారు. కాగా.. ఆమె తర్వాత నీటిని సరఫరా చేసిన వారందరికీ ఓ మంత్రి సిఫారసుతో మున్సిపల్ అధికారులు బిల్లులు మంజూరు చేశారని.. తనకు మాత్రం బిల్లు చెల్లించలేదని నాగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా పార్టీ నాయకులు తన మొర ఆలకించి తన సమస్యను గుర్తించి తనకు రావలసిన మునిసిపాలిటీ బకాయి బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ కంటతడి పెట్టుకున్నారు.