YCP ACTIVISTS ATTACK ON WOMENS HOSTEL : రాష్ట్రంలో అధికార పార్టీ మూకల దాడులు ఎక్కువైయ్యాయి. ఎవరైనా ఎదురుతిరగడం.. లేకపోతే తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తే వెంటనే దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా ఘర్షణలకు దిగుతున్నారు. అడ్డుకున్న వారిపై రాళ్లు విసరడం, దుర్భాషాలడటం వంటి వాటికి పాల్పడుతున్నారు. ఏదైనా జరిగితే అధికార పార్టీ నాయకులే తమకు అండగా ఉంటారనే ధైర్యంతో విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అధికారి పార్టీకి చెందిన వారి ఆగడాలే ఎక్కువవుతున్నాయి.
వైసీపీ దాడులపై పోలీసులను ఆశ్రయించలేని వారు.. వారిని ఎదిరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్న పోలీసులు.. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి కేసును పక్క దారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు పట్టపగలే ఘర్షణకు దిగారు. ఒంగోలు పట్టణంలోని మహిళా వసతి గృహంపై మూకదాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న మహిళలను దుర్భాషాలాడారు. కొందరిపై దాడికి సైతం పాల్పడ్డారు. ఈ ఘటనతో ఒంగోలు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న ఒక మొబైల్ దుకాణంలో చరవాణి బీమా విషయంలో సాయి కిషోర్ అనే ఇంజినీరింగ్ విద్యార్థికి, నిర్వాహకులకు మధ్య ఈ నెల 24న వివాదం తలెత్తింది. దీంతో రెండు వర్గాలు అక్కడే బాహాబాహీగా తలపడ్డాయి. గొడవ అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది అనుకుంటే.. వైసీపీ నాయకులు మరోసారి దాడులు చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థి సాయి కిషోర్ తల్లిదండ్రులు పట్టణంలోని నిర్మలా నగర్లో రాజ రాజేశ్వరీ మహిళా వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకు చెందిన సుబానీ అనే వ్యక్తి ఆధ్వర్యంలో సుమారు 30 మంది వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు.
సాయికిషోర్తో పాటు అతని తండ్రిపై దాడికి దిగారు. వసతి గృహం భవనంలోకి దౌర్జన్యంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న మహిళలను దుర్భాషలాడుతూ లోపలికి ప్రవేశించారు. భవనంలోని వస్తువులను ధ్వంసం చేశారు. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: