"విద్యార్థులను శాస్రవేత్తలుగా మార్చేందుకే..స్పేస్ వీక్ నిర్వహణ" - చీరాలలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
చీరాలలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు భారీగా హాజరై ఈ ప్రదర్శనను తిలకించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నారులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఉందని నిర్వహణ కమిటీ ఛైర్మన్ రమేశ్ తెలిపారు.
విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ సైంటిస్ట్, వరల్డ్ స్పేస్ వీక్(డబ్ల్యూ.ఎస్.డబ్ల్యూ) కమిటీ ఛైర్మన్ రమేశ్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో శ్రీహరికోట ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు-2019ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీహరికోటలోని ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు విద్యార్థులకు రాకెట్లు పంపించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డబ్ల్యూ.ఎస్.డబ్ల్యూ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ రమేశ్ బాబు మీడియాతో మాట్లాడారు. అంతరిక్షం పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం వారోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇలాంటి ప్రదర్శనలతో విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ప్రదర్శనలో ఆర్యభట్ట, జీఎస్ఎల్వీ రాకెట్ల నమూనాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ కార్యక్రమం తమకెంతో ఉపయోగపడిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. స్పేస్ సెంటర్లో రాకెట్టు తయారీ, వాటి ప్రయోగం వంటి అంశాలను తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. చీరాల పర్చూరు నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు.