ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనుషులు రావొద్దన్నారు... మృత్యువు రమ్మంది..! - ప్రకాశం జిల్లాలో క్యాన్సర్​తో మహిళ మృతి

అమ్మను వెంటాడుతున్న మరణం ఓ వైపు... తుదిదశకు చేరిన ఆమెను ఇక్కడ ఉంచొద్దంటూ తరుముతున్న మనుషులు మరోవైపు... ఆ కుమారుడిని నిలువనీయలేదు. తనను కళ్లల్లో పెట్టుకొని పెంచిన అమ్మ...క్యాన్సర్‌ బారిన పడేసరికి... ఆ కుమారుడి హృదయం తల్లడిల్లింది. ఎలాగైనా కాపాడుకోవాలని తపించాడు. రెండు రోజులుగా చేతులపై మోసుకుంటూ తిరిగారు. చీత్కారాలు దిగమింగుతూ బతిమిలాడాడు. కానీ ఎవ్వరూ స్పందించలేదు. కానీ మృత్యువు స్పందించి... ఆ అమ్మను తీసుకెళ్లింది.

మనుషులు వద్దంటే ... మృత్యువే అమ్మను తీసుకెళ్లిపోయింది.

By

Published : Nov 21, 2019, 4:33 PM IST

మనుషులు వద్దంటే ... మృత్యువే అమ్మను తీసుకెళ్లిపోయింది.

వెంకటయ్య, వెంకటలక్ష్మి దంపతులది ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం. మూడేళ్లుగా పామూరులోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. 4నెలల కిందట వెంకటలక్ష్మి(67)కు క్యాన్సర్‌ సోకింది. మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ... కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు సతీశ్‌... ఆమె చికిత్స కోసం రూ.4 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అయినా ఫలితం దక్కలేదు. వెంకటలక్ష్మి ఆరోగ్యం క్షీణించగా... ఈ నెల 18న పామూరులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రిమ్స్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.

తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో ఇంటి యజమాని ఎదురొచ్చారు. ఆమెను తన ఇంటికి తీసుకురావొద్దని అడ్డుకున్నాడు. కన్నీరు దిగమింగుతూ... తల్లిని స్థానిక ఆసుపత్రికే తీసుకెళ్లాడు సతీశ్‌. అక్కడా చీత్కారం ఎదురైంది. వేరే దారిలేక సమీపంలోని ఓ పరిశ్రమలో ఆ రాత్రి తలదాచుకున్నారు. తర్వాతి రోజు ఉదయం సిబ్బంది వచ్చి... అక్కడి నుంచీ తరిమేశారు.

దిక్కుతోచని స్థితిలో ఉన్న సతీశ్... తన తల్లిని చేతులపై మోసుకుంటూ స్థానిక డీవీ పార్కుకు వెళ్లారు. అక్కడే రాత్రి 8 గంటల వరకు ఉన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వృద్ధురాలిని పామూరు వైద్యశాలలో చేర్చుకోవాలని వైద్యాధికారికి సూచించారు. సిబ్బంది ఆమెను చేర్చుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటలక్ష్మి మరణించారు.

అంత బాధలో ఉంటే... స్నేహితులు, బంధువులు ఎవరూ సాయం చేయలేదని... తన గోడు పట్టించుకున్న నాథులు లేరని సతీశ్ బోరున విలపించారు. ఈ దుస్థితి మరెవరికీ రాకూడదంటూ... కన్నీరుపెట్టుకున్నాడు.

ఇవీ చదవండి

అక్కాచెల్లెళ్ల అకాల మరణం.. తల్లిదండ్రులకు తీరని శోకం

ABOUT THE AUTHOR

...view details