ప్రకాశం జిల్లా మార్టూరులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గొట్టిపాటి హనుమంతురావు కాలనీలో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు భయందోళనకు గురయ్యారు. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసముండే పఠాన్ ఖాశింవలీ కుటుంబానికి, పఠాన్ సులేమాన్ కుటుంబానికి కొద్ది కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఖాశింవలి తన భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. తన ఇంటి వాకిలి బండలపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి నిమ్మకాయలు, కోడిగుడ్లు ఉండటాన్ని గమనించాడు. ఇరుగు పొరుగు వారిని నిద్రలేపి చూపించాడు. వెంటనే కాలనీ వాసులతో కలిసి సులేమాన్ కుటుంబ సభ్యులపై పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు క్షుద్రపూజల స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు సులేమాన్ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టినా తీయలేదు. ఆదివారం తమ ఇంటి ముందు క్షుద్రపూజలు చేస్తారా... అని బాధితులు సులేమాన్ కుటుంబ సభ్యులను అడగ్గా.. సులేమాన్ కత్తి తీసుకుని బాధితుడి తల్లి కరీమూన్ పై దాడి చేశాడు. ఖాశింవలీ తలకు బలమైన గాయం కాగా.. తల్లికి చేతివేళ్లు తెగిపోయాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ సులేమాన్ ను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు.