వెలిగొండ ప్రాజెక్ట్ పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే చెల్లిస్తామని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ హరిజవహర్ లాల్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు తీరుపై సంబంధిత అధికారులతో ఒంగోలు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం జరిగింది. జిల్లాకు వచ్చిన ఆయన ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,300 కోట్ల నిధులు కేటాయించిందని కమిషనర్ చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజికి చెందిన బిల్లులు రెండు రోజుల్లో సీఎఫ్ఎమ్ఎస్ పే అండ్ అకౌట్స్కు పంపాలన్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజి కింద పెండింగ్లో ఉన్న రూ. 47 కోట్లు, భూసేకరణకు సంబంధించిన మరో రూ. 40 కోట్ల బిల్లులు తక్షణమే చెల్లిస్తామన్నారు.
పునరావాస పనులు వేగంగా చేపట్టడానికి జిల్లా కలెక్టర్, జేసీలు సమగ్ర ప్రణాళిక రూపొందించడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా ఆర్ అండ్ ఆర్ కాలనీలలో ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పన వేగంగా చేపట్టాలన్నారు. ప్రస్తుతం మూడు పునరావాస కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించగా, మరో ఐదు కాలనీలలో పనులు వివిధ దశల్లో ఉండడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.