ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గురువాజీపేటలో సుమారు 46 లక్షల రూపాయలతో డ్వామా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ షెడ్ పథకం సత్ఫలితాలిస్తోంది. భూగర్భజలాల వృద్ధితో పాటు బోడికొండను పచ్చదనంతో నింపే విధంగా ఈ కార్యక్రమం అమలవుతోంది. వర్షం సమయంలో కొండమీద నుంచి దిగువకు జోరుగా ప్రవహించే నీటికి అడ్డుకట్టువేసేలా రాతి చెక్‌డ్యాంలు నిర్మించారు. బోడికొండల చుట్టూ సుమారు 32 కిలోమీటర్లలో కందకాలు తవ్వారు. కొండ దిగువున నీటిని నిల్వ ఉంచేందుకు కుంటలు తవ్వారు.
100 ఎకరాల్లో నిర్వహణ
అధికారులు కొండను తవ్వే మెళుకువలు నేర్పటంతో సుమారు 250 మంది కూలీలు కందకాలు తవ్వి, చెక్‌డ్యాంలు నిర్మించారు. సీతాఫలం, చింత, నేరేడు, కాగు జాతులకు చెందిన 50 వేల మొక్కలు నాటారు. వర్షాలు బాగా కురవడం వల్ల మొక్కలన్నీ ఏపుగా పెరుగుతున్నాయి. సుమారు 100 ఎకరాల్లో ఈ వాటర్‌షెడ్ పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల నుంచి వాటర్ షెడ్ సభ్యులు, సాంకేతిక నిపుణులు వచ్చి పనుల తీరును పరిశీలించారు.