Water problems: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. నగరంలోని పలు కాలనీలకు నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరంలోని కర్నూల్ రోడ్డులో ఉన్న పీర్లమాన్యం, అరుణోదయ కాలనీ తదితర ప్రాంతాల వాళ్లు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితం రక్షిత మంచినీటిని అందించేందుకు పైపులు వేసినా.. నీటి సరఫరాకు వీలుగా వీధి కుళాయిలు ఏర్పాటు చేయలేదు. పాలకులు పట్టించుకోకపోవడంతో పైపులు శిథిలావస్థకు చేరాయి. వారానికోసారి వచ్చే ట్యాంకర్లతో తమకు తాగునీటి కష్టాలు తప్పడంలేదని స్థానికులు వాపోతున్నారు.
వేసవి తీవ్రతతో పాటు నీటి ఎద్దడి పెరగడంతో సమయానికి రావాల్సిన ట్యాంకర్లు కూడా రావడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే కొద్దిపాటి నీటిని డ్రమ్ములు, డబ్బాల్లో నిల్వ చేసుకుని పొదుపుగా వాడుకుంటున్నామన్నారు. నీరు చాలక భారమైన తప్పనిసరి పరిస్థితుల్లో మంచి నీటిని కొనుగోలు చేయాల్సిన వస్తోందంటున్నారు. ఒంగోలు నగరంలో నీటి కష్టాలకు.. నగర పాలక సంస్థ శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.