ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పనులు మానుకుని.. నీటి కోసం పడిగాపులు

By

Published : Jun 1, 2019, 8:04 PM IST

పశ్చిమ ప్రకాశంలోని పల్లెలూ, పట్టణాలు అన్నీ కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. భూమి పొరల్లోకి వెళ్ళి ఎంత తవ్వినా గుక్కెడు నీళ్ళు కానరావడం లేదు. అర లక్ష జనాభా ఉన్న కనిగిరి పట్టణంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

కనిగిరి క'న్నీటి' గోడు

కనిగిరి క'న్నీటి' గోడు

ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయితీలో తాగునీటి ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రధాన సాగునీటి వనరుల నుంచి నీరు అందక నల్లాలు పని చేయడం మానేసాయి. భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి బోర్లు బోరుమంటున్నాయి. నగర పంచాయితీ ట్యాంకు ద్వారా సరఫరా చేసే నీటి కోసం ప్రజలు మండుటెండలోనూ పడిగాపులు కాస్తున్నారు. పట్టణానికి రామతీర్థం జలాశయం నుంచి తాగునీటి సరఫరా చేయాల్సి ఉన్నా నీటి సామర్థ్యం, అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల ఈ నీళ్లు సగం జనానికి కూడా సరిపడటంలేదు. ట్యాంకర్లు కూడా వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వస్తున్నందున చాలీ చాలని నీటితో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ట్యాంకు నీరు చాలీచాలక..

అర లక్ష జనాభాకు ట్యాంకర్లతో పంపిణీ చేయడం అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. రోజుకు 250 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇందుకోసం ప్రభుత్వం రోజుకు దాదాపు లక్షన్నర రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రతీ ఇంటికి రెండు డ్రమ్ములు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ రెండు డ్రమ్ములు నీళ్లే దాదాపు వారం రోజులు వినియోగించుకోవలసి వస్తోంది.

అపార్టుమెంట్లలో ఉండే ప్రజలు నీరు పైకి తీసుకెళ్లడానికి నరకయాతన పడాల్సివస్తోంది. ఈ ప్రభావంతో పై అంతస్తుల్లో అద్దెకు ఉండడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కూలీ పనులు చేసుకునే వారు ట్యాంకులు వచ్చే రోజు తమ పనులను మానుకొని నీటిని పట్టుకుంటున్నారు. కొత్త ప్రభుత్వమైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details