ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా
ఒంగోలులో ఏటా వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రకాశం జిల్లాలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో అయితే వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటుతుంటాయి. దీంతో తాగునీటి బావులతో పాటు, చేతి పంపులు ఒట్టిపోతున్నాయి. మరోపక్క కోస్తా తీరప్రాంత గ్రామాల్లోనూ నీటి సమస్యలు నెలకొంటున్నాయి. చాలా పల్లెల్లో వేసవి సీజన్‌కు ముందే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ మేరకు ఏటా రెండు దఫాలు నాగార్జున సాగర్ నీటి విడుదల పైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోపక్క ఏటా సుమారు రూ.వంద కోట్ల వ్యయంతో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. అయినా పల్లె వాసులకు దాహార్తి తీర్చడంలో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సమస్యపై దృష్టిసారించింది. ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా జల జీవన్ మిషన్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పథకం అమలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తయారు చేశారు. కలెక్టర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. తొలి విడతగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2,190 పనులకు నిధులు...
జిల్లాలో మొత్తం 1050 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 30,23,474 మంది జనాభా ఉండగా; 7,31,207 ఇళ్లు ఉన్నాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల లెక్కల ప్రకారం అందులో 2,15,579 ఇళ్లకే మంచినీటి సరఫరా కుళాయిలు ఉన్నాయి. మరో 5,15,628 కుటుంబాలకు కొత్తగా ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఇంతవరకు కుళాయిలు లేని నివాసాలకు కొత్తగా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.889.44 కోట్ల నిధులతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)ను రూపొందించారు. జల జీవన్ మిషన్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశం. నీటి వనరుల లభ్యత, అదనపు నిధుల గురించి ఈ ప్రాజెక్ట్‌లో కేటాయింపులు లేవు. కేంద్ర ప్రభుత్వం సగ భాగం కేటాయించనున్న నిధులతో కేవలం ఇంటింటా కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా తాగునీటి పైపులైన్లను మాత్రమే విస్తరించనున్నారు. 2022 నాటికి ఇంటింటా కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా 2,09,833 కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చేందుకు జిల్లా కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అందుకు రూ.164.58 కోట్లతో అంచనా రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,190 పనులకు రూ.527 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి.
ఆశలన్నీ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పైనే...
జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం నిమిత్తం ఇంటింటా కుళాయి ద్వారా తాగునీరందించేందుకు గత ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ద్వారా నిధుల మంజూరుకు ప్రతిపాదనలు తయారు చేసి, కొంత మేర బడ్జెట్ కేటాయించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రారంభానికి నోచని పనులన్నీ రద్దు చేసింది. ఇటీవల సంబంధిత అధికారులు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ కింద రూ.5,330 కోట్లతో డీపీఆర్ తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు. అందులో భాగంగా ఇటీవల తొలి విడతగా కనిగిరి ప్రాంతానికి రూ.833 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే కనిగిరి నియోజకవర్గం ఆరు మండలాల పరిధిలోని 443 గ్రామాలు; మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం, కొనకనమిట్ల మండలాల పరిధిలోని మరో 93 గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. ఆ ప్రాంతాలకు నీటి సరఫరా నిమిత్తం వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి గొట్టాలు ఏర్పాటు చేయనున్నారు. అది పూర్తయితే ఆ రెండు నియోజకవర్గాల పరిధిలోని 536 శివారు ప్రాంతాలకు మంచినీటి సమస్య పరిష్కారం కానుంది.
ఇదీ చదవండి: