తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన యువతికి.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తిమ్మాపురానికి చెందిన కాశి ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. కొద్ది రోజుల తర్వాత ప్రేమించాలని వేధించాడు. యువతి వద్దని వారిస్తే.. స్నేహితులతో మాట్లాడించాడు. కాశి ఎంతో ఇష్ట పడుతున్నాడని, అతనిది నిజమైన ప్రేమ అని.. ఏవేవో మాయమాటలు చెప్పి నమ్మించారు.
ఓ వైపు కాశి, మరో వైపు స్నేహితులు.. అందరి మాటలతో ఆమె ఆలోచనల్లో పడింది. ప్రేమ నిజమేనని నమ్మింది. ఓ మనసు పడ్డ ముహుర్తాన ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అందరినీ ఒప్పించి.. మళ్లీ ఘనంగా పెళ్లి చేసుకుందామని చెప్పాడు.
రెండు నెలల్లో అతనికి మొహం మొత్తేసింది. అతనిలో అసలైన మనిషి బయటికొచ్చాడు. చెప్పా పెట్టకుండా మరో పెళ్లి చేసేసుకున్నాడు. ప్రేమని అక్కడ, ఇక్కడ చెరో సగం పంచేస్తున్నాడు. కొద్దిరోజుల తర్వాత డబ్బులు కావాలని వేధించడం ప్రారంభించాడు. కట్నం కింద రూ.10 లక్షలు తేవాలని ఒత్తిడి తెచ్చాడు. అంత ఇవ్వలేనని, ఎంతో కొంత ఇస్తానని చెప్పింది. నాటి నుంచి మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించాడు.