ఒంగోలు రాజీవ్ నగర్‌లో ఇలా...
పట్టణాల్లో ఇళ్ల మధ్య ఉండే ఖాళీ స్థలాలు ఇటీవలి వర్షాలకు మురుగునీరు చేరి కప్పలు, విషపురుగులు, దోమలకు ఆవాసమయ్యాయి. దీంతో వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఒంగోలు నగర పాలక సంస్థ, మార్కాపురం, చీరాల, కందుకూరు పురపాలికలు, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి, అద్దంకి, దర్శి నగర పంచాయతీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గిద్దలూరు పురపాలికల్లో ఖాళీగా ఉంటూ చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించే స్థలాలను అధికారులు గుర్తించాలి. వాటిని యజమానులతో శుభ్రం చేయించాలి. అయితే ఎక్కడా ఈ తరహా చర్యలు లేవు. ఎవరైనా ఇల్లు నిర్మించుకునేందుకు ప్లాన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఖాళీ స్థలానికి నిర్ణీత పన్ను విధించి వసూలు చేస్తున్నారు. అంతేగానీ స్వయంగా గుర్తించి పన్ను వేయడం లేదు. ఫలితంగా స్థానిక సంస్థలకు ఆదాయం రాకుండా పోతోంది.
ఆరంభ శూరత్వం...
ఒంగోలులో ఖాళీ స్థలాలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. యజమానులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా మెరక చేయకపోతే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. కొన్నిచోట్ల ఆ మేరకు బోర్డులు పెట్టారు. తరువాత చర్యలు లేకుండాపోగా ఇటీవలి భారీ వర్షాలకు ఖాళీ స్థలాలు అధ్వానంగా తయారయ్యాయి. వాటిపై ఇరుగుపొరుగు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుల్లేరు. ఉదాహరణకు ఒంగోలులో ఖాళీ స్థలాలు 10 వేలకు పైగా ఉండగా, అధికారిక లెక్కల్లో 2,551 మాత్రమే ఉన్నాయి.
చర్యలు తీసుకుంటే ప్రయోజనం...
ఖాళీ స్థలాల యజమానుల చిరునామాలు గుర్తించి నోటీసులు ఇచ్చి పన్నులు విధించడంతోపాటు, వాటిని శుభ్రం చేయిస్తే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరుతుంది. ఈ విషయమై ఒంగోలు కమిషనర్ కె.భాగ్యలక్ష్మిని వివరణ కోరగా ఖాళీ స్థలాలవల్ల చాలా సమస్యగా ఉందని, పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నామన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా చిరునామాలు సేకరించి నోటీసులు ఇస్తామని, పన్నులు వేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:
కార్తిక పౌర్ణమి..పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికశోభ