ప్రకాశం సరిహద్దులో వేల మంది కూలీల అడ్డగింత - వలస కూలీలు వార్తలు
లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ కొంతమంది పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా వలస కూలీలకు పనులు, సరైన వసతి లేకపోవటం వల్ల సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. గుంటూరు జిల్లా నుంచి కర్నూలు వైపు వెళ్తున్న వేల మంది వలస కూలీలు ప్రకాశం జిల్లాలో చిక్కుకుపోయారు.
ప్రకాశం-గుంటూరు జిల్లాల సరిహద్దు వద్ద వేల మంది వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న వీరి వాహనాలను ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలం గుట్ల ఉమ్మడివరం దగ్గర పోలీసులు నిలిపివేశారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా మిర్చి కోతలకు కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లాకి వెళ్లారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించటంతో తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరారు. మొత్తం 50 వాహనాల్లో దాదాపు 2000 మందికి పైగా ప్రయాణిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం రాత్రి నుంచి వారంతా ఇక్కడే ఉన్నారు. కూలీల దగ్గర వంట సామగ్రి ఉండటంతో కొంతమంది అన్నం వండుకుంటున్నారు. వారికి ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేశారు. వారితో ప్రస్తుతం అధికారులు చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి:కూలీల కన్నీటి యాత్రలు.. 100ల కి.మీ నడుస్తూ, రిక్షా తొక్కుతూ...