రాత్రంతా ఆ ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడింది. తెల్లవారే అంతా పెళ్లి వేడుకకు ముస్తాబయ్యారు. సమయం లేదాయె! కొద్ది గంటల్లోనే ముహూర్తం.. వధువును తీసుకొని ఓ వాహనంలో పిల్లలు, పెద్దలు అంతా కలిసి బయలుదేరారు. మరో గంటలో వరుడి ఇంటికి చేరుకుంటారనగా విధి వెంటాడింది. తమను క్షేమంగా తీసుకెళ్లాల్సిన వాహనమే పంజా విసిరింది. ఇద్దరు పెద్దలు, మరో ఇద్దరు పిల్లల ఆయువు తీసింది. ఎంతో సంతోషం నడుమ శుభకార్యం జరగాల్సిన సమయంలో గుండెకోత మిగిల్చింది.
కొనకనమిట్ల మండలంలోని గార్లదిన్నె వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయతీ సోమేపల్లి నుంచి బయలుదేరిన పెళ్లి బృందంలో నలుగురు మృత్యువాత పడటంతో విషాదం అలముకుంది. కనకం కోటేశ్వరరావు, రమణమ్మ దంపతుల కుమార్తెకు పొదిలి మండలం అక్కచెరువుకు చెందిన యువకుడితో ఉదయం 11 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండటంతో గొబ్బూరుకు చెందిన మినీ ట్రాలీని మాట్లాడుకున్నారు. పెళ్లి కుమార్తెతో పాటు బంధువులు మరో ఇరవై మంది ఇందులో ఎక్కారు. డ్రైవర్ ఆంజనేయులు దీనిని నడుపుతున్నాడు. తెల్లవారుజామున దాదాపు 5.30 గంటలకే బయలుదేరిన వీరంతా 38 కిలోమీటర్లు ప్రయాణించి గార్లదిన్నె వద్దకు చేరుకునేసరికి 6.30 గంటలైంది. మరో గంటలో అక్కచెరువుకు వెళ్లాల్సి ఉండగా ఆటో వెనుక డోరుపై కూర్చొన్న అయిదుగురు గొలుసు తెగి తలుపు ఊడి కిందకు పడిపోయారు. అప్పటికే 80 కి.మీ. వేగంతో వెళ్తుండటంతో ఆ అదుటుకు వారంతా రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు స్వల్పంగా గాయపడగా మిగిలిన నలుగురు చనిపోవడంతో అంతా విషాదంలో మునిగిపోయారు.
బావ బావమరుదులిద్దరూ కలిసే..
ప్రమాదంలో మృతిచెందిన కొంగని శ్రీనివాసులు, బోగోలు సుబ్బారావు బావబావమరుదులు. వీరు పెద్ద దోర్నాలలో ఉంటారు. వారిద్దరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి తొలుత సోమేపల్లి వెళ్లారు. అక్కడి నుంచి బంధువులతో కలిసి పెళ్లికి బయలుదేరారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. సుబ్బారావు వెలిగొండ సొరంగాల్లో కార్మికుడు. ఆయనకు తల్లి పిచ్చమ్మ, భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. ఇప్పుడు తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. శ్రీనివాసులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భార్య పార్వతి కూలి పనికి, కుమారుడు రాజేష్ వెలిగొండలో పనులకు వెళ్తున్నారు. వైద్యశాలకు ఇతనిని తీసుకువెళ్దామనుకునే సమయంలో బంధువుల ఇంట వివాహం ఉండటంతో అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. ఇంతలోనే మృత్యు ఒడికి చేరాడని భార్య పార్వతి రోదిస్తున్నారు. తన భర్త, తమ్ముడు ఒకేసారి అందని లోకాలకు వెళ్లిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు.