TTD CHAIRMAN YV SUBBAREDDY AT VELUGONDA : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు అక్టోబర్ నాటికి పూర్తిచేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు.
సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయని నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని ఇంజినీరింగ్ అధికారులు వారికి వివరించారు. రెండో సొరంగంలోకి కొంత దూరం వాహనంలో వెళ్లి వచ్చారు. నిర్మాణ పనుల పురోగతిపై సీఈ మురళీనాథరెడ్డితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వెలిగొండ తొలి సొరంగం నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు.
"దురదృష్టవశాత్తు కరోనా మహమ్మారి వల్ల ప్రాజెక్ట్ పనులు రెండు సంవత్సరాలు ఆగాయి... ఆ తరువాత పరిస్థితులు మెరుగుపడటంతో పనులు మొదలుపెట్టాం. మొదటి టన్నెల్ పూర్తి అయ్యింది.. ఈ నిముషంలో అయిన నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే రెండో టన్నెల్లో 2.6 కిలో మీటర్ల మేర పనులు పెండింగ్ ఉంది.. అది పూర్తి కాగానే రెండు టన్నెల్స్ ద్వారా నీరందిస్తాం. మొదటి టన్నెల్ పూర్తి అయినా నీరు ఇవ్వడానికి అభ్యంతరం ఏమి లేదు. ఒక వేళ నీరు వదిలితే రెగ్యులేటర్ కట్టే వీలు ఉండదు"-వైవీ సుబ్బారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్