నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినీ, రాజకీయ రంగాలను శాసించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహానేత. తెలుగు నాట ప్రఖ్యాత ఆంధ్రుడెవరంటే ఎన్టీఆర్ పేరు తప్ప మరెవరి పేరు వినపించదు. కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని ఆలోచించిన వాస్తవిక వాది. అందుకే సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని నినదించారు. జనమే ఊపిరిగా రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీని స్ధాపించి దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా సంక్షేమ రాజ్యానికి బీజం వేశారు. పార్టీ ప్రారంభించిన 13 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రయ్యారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు... ఇలా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా లభించేలా అవతరింపచేసి.. ఆ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ఓ శకం. ఆయన ప్రవేశం.. రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఈ చైతన్యాన్ని నమ్ముకునే ఆయన తన రాజకీయ జీవితం చివరి వరకూ ధైర్యంగా నడవగలిగారు. 13 ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. మూడుసార్లు విజయం సాధించి.. అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్‌కు ప్రజల పాలనే తప్ప ఎమ్మెల్యేల లాలన తెలియదు. అందుకే ప్రజా సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు.