ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొగాకు రైతుకు కొవిడ్‌ పోటు - Severe damage to tobacco farmers in Prakasam district

ఒక వైపు ప్రతికూల వాతావరణం... మరో వైపు కరోనా లాక్‌డౌన్‌, మార్కెట్‌లో ఒడిదుడుకులు,...వెరసి ఈ ఏడాది పొగాకు రైతు అప్పలు ఊబిలో మునిగాడు..! కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. సీజన్‌ ముగిసింది... అంతా తిరిగి చూస్తే ఒకో రైతు బ్యారన్‌కు లక్షల్లో రుణభారాన్ని మిగుల్చుకున్నాడు.

Prakasam district has suffered a severe loss to tobacco farmers this year
నష్టాల్లో పొగాకు రైతులు

By

Published : Oct 10, 2020, 2:44 PM IST

2019-20 సీజన్‌లో వర్షాలు కాస్తా ముందుగానే కురియడంతో పొగాకు రైతులు ఆనందించారు.. వాతావరణం అనుకూలమని సాగు కూడా ముందుగానే ప్రారంభించారు. అంతలో అధిక వర్షాలు.. వేసిన మొక్క కుళ్ళి పాడయ్యింది.. మళ్ళీ రెండో సారి పంట వేసుకున్నారు. మొక్క చకచకా పెరిగింది... కోతలకు ఆకు అనుకూలమనుకున్నారు.. కానీ అక్కడా ఇబ్బంది తప్పలేదు.. బేరన్‌లోకి పంపినా క్యూరింగ్‌ కాకుండానే రెండో కోతకు ఆకు సిద్దమయ్యింది. దీంతో క్యూరింగ్‌కు అవకాశం లేక ఆరేడు కోతలకు గాను ఒకటి రెండు కోతలు వదులుకోవలసి వచ్చింది. ఈ విధంగా కొంత నష్టపోయారు.

కష్టాల కాలంలో మరో దెబ్బ...

అనుకున్న సమయం కన్నా ముందుగానే రైతుకు పంట చేతికి రావడంతో బోర్డు కూడా ముందుస్తుగానే ఫిబ్రవరి నెలలో కొనుగోళ్ళు ప్రారంభించింది. అయితే బయ్యర్లు మాత్రం అంతగా రాకపోవడం కొంత నిరుత్సుహానికి గురయ్యారు. మందకొడిగా కొనుగోళ్ళు సాగుతున్నాయని అనుకుంటున్న సమయానికి మార్చినెలలో కరోనా భూతం వచ్చిపడింది. లాక్‌ డౌన్‌తో దాదాపు 40 రోజులు పాటు కొనుగోళ్ళు నిలిపివేసారు. ఈ సమయంలో పొగాకు రంగు మారడం, నాణ్యతో కోల్పోవడంతో మళ్లీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది...బేళ్ళను తరుచూ ఆరబెట్టుకోవడం మళ్ళీ కట్టలు కట్టుకోవడం చేయాల్సి వచ్చేది. మరి కొందరు శీతలగిడ్డంగుల్లో భద్రపరుచుకోవలసి వచ్చింది... ఇదో అదనపు ఖర్చు... ఇలా ఖర్చు మీద ఖర్చు... దీంతో రైతులు తమ పంట విషయంలో ఆందోళనకు గురయ్యారు.

పడిపోయిన ధర

ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది దక్షిణాది నల్లరేగడి నేల, దక్షిణాది తేలికపాటి నేలల్లో కలిపి 83.92 మిలియన్ల కిలోల పంటను అమ్మాకాలు జరిగాయి. సరాసరి 116 రూపాయలు చొప్పున ధర పలికింది. ఒంగోలు 1వ ప్లాట్‌ ఫారంలో అత్యధికంగా 122.18 రూపాయలు, తక్కువుగా పొదిలి104.50 రూపాయలు చొప్పున సరాసరి ధర పడింది... హై గ్రేడ్‌ పొగాకు ధర బాగానే
పడింది.. కాకపోతే ఈ రకం పొగాకు ఉత్పత్తి 10శాతానికి మించి ఉండదు... మిగతా 90 శాతం పంట మిగతా గ్రేడ్‌ల్లో ఉండటంతో పెద్దగా ధర పలకలేదు... ఇలాంటి బాధిత రైతులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల తీవ్రంగా నష్టపోయారు.. కాకపోతే ఈ ఏడాది మధ్య నుంచి ప్రయివేట్‌ ట్రేడర్లతో పాటు మార్క్‌ ఫెడ్‌ కూడా మార్కెట్‌లోకి రావడం కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి.

అప్పుల భారం..

వివిధ కారణాలు వల్ల రైతు దగ్గర ఉన్న చివరి బేళ్ళు వరకూ కొనుగోళ్ళు చేయాలనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకూ వేలం నిర్వహించారు. ఇది మంచి అవకాశం అయినా దాదాపు నెలరోజులు పాటు ఆలస్యం కావడం వల్ల చేసిన అప్పులకు వడ్డీలు కూడా అదే స్థాయిలో పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. నాణ్యత లేదని చెప్పి నోబిడ్లు ప్రకటించి, బేళ్ళను వెనుక్కు పంపించిన సందర్భాలు కూడా రైతులు ఎదుర్కొన్నారు. దీని వల్ల ఒక్కో బేల్‌కు 500 రూపాయల వరకూ నష్టపోయారు. మొత్తానికి సీజన్‌ అంత లాభసాటిగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తున్న సీజన్‌ అయినా గిట్టుబాటు ధర లభిస్తే పొగాకు రైతుకు ఊరట కలుగుతుందని పలువురు ఆశిస్తున్నారు.

ఇదీ చదవండి:సామాన్యుడికి షాక్​..ఇంటికి రూ.1.4 లక్షల విద్యుత్​ బిల్లు

ABOUT THE AUTHOR

...view details