ఇల్లు దక్కేనా - కల నెరవేరేనా - టిడ్కో లబ్ధిదారుల ఆవేదన TIDCO Beneficiaries Houses Allotment: పేదలయిన లబ్దిదారులకు ఇళ్లు కట్టించి అప్పగించేందుకు గత ప్రభుత్వం ప్రారంభించిన టిడ్కో ఇళ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కన పడేసింది. నాలుగున్నరేళ్ల నుంచి ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న హామీ ఇప్పటికీ నెరవేరడం లేదు. 2023 డిసెంబర్ నెలాఖరు నాటికి గృహ ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్న ప్రభుత్వ మాటలను నమ్మి టిడ్కో లబ్దిదారులు మరోసారి మోసపోయారు. వేలాది రూపాయలు అప్పు చేసి డిపాజిట్లు కట్టిన పేదలకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది.
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళ నిర్మాణం 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయి. వీటిని లబ్దిదారులకు కేటాయించాల్సిన సమయానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పట్ల చూపించిన నిర్లక్ష్యం లబ్దిదారులకు శాపాలుగా మారింది. గతంలో షేర్‌వాల్ టెక్నాలజీతో, అపార్టమెంట్‌ను తలదన్నే విధంగా నాణ్యతతో పాటు, సకల సౌకర్యాలతో నిర్మించారు. ఇక ఇల్లు కేటాయిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందని అంతా సంబరపడ్డారు. ప్రభుత్వం మారినా దాదాపు చివరి దశలో నిర్మాణాలు ఉన్న ఇళ్లను పూర్తి చేసి, తమకు అప్పగిస్తారని భావించారు. కానీ, నాలుగన్నర సంవత్సరాలుగా లబ్దిదారుల మీద జగన్ ప్రభుత్వం కక్ష పెట్టుకుంది. లబ్దిదారులు పలు మార్లు తమకు ఇళ్లు కేటాయించాలని అభ్యర్థించినా, ఉద్యమించినా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.
టిడ్కో ఇళ్లపై హద్దుల్లేని మడమ తిప్పడాలు- మూడేళ్లుగా అదిగో ఇదిగో అంటూ ప్రగల్భాలు
ఒకో లబ్దిదారుడు అయా ఇంటి కేటగిరిని బట్టి రూ.25 వేలు నుంచి లక్ష రూపాయల వరకూ చెల్లించారు. సింగిల్, డబల్ బెడ్ రూం కోసం చెల్లించిన డబ్బు ప్రభుత్వం దగ్గరే మూలుగుతోంది. పైగా ఇంటి నిర్మాణం కోసం అప్పుతెచ్చిన బ్యాంకులు కిస్తీలు కట్టమని నోటీసులు పంపుతున్నాయి. అప్పులుచేసి డిపాజిట్ కట్టిన దానికి వడ్డీలు చెల్లించలేక, బ్యాంకు కిస్తీలు కట్టలేక, అద్దె ఇంటికి కిరాయి చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నాం.ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, తమకు తక్షణం ఇళ్లు కేటాయించాలి. లక్ష్మీనారాయణ, లబ్ధిదారు
జిల్లాలో ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలలో ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఒంగోలులో చింతల, కొప్పోలు వద్ద రెండు లే అవుట్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా 9568 ఇళ్లు నిర్మాణం చేప్టటారు. కనిగిరి వంటి ప్రాంతంలో తలుపులు, విద్యుత్తు లైన్లు కూడా వేసారు. ఒంగోలులో రెండు లేఅవుట్లు కలిపి దాదాపు 4128 ఇళ్లు నిర్మించారు. ఈ ఇళ్లన్నీ నిర్లక్ష్యానికి ప్రతిరూపాలుగా కనిపిస్తున్నాయి. వర్షం కురిస్తే చెరువును తలిపించే విధంగా, పిచ్చిమొక్కలతో దారుణంగా తయారయ్యాయి. పెండింగ్ పనులు పూర్తి చేసి, 2023 డిసెంబర్ నాటికి లబ్దిదారులకు ఇళ్లు కేటాయిస్తామని గతంలో అధికారులు ప్రకటించినప్పటికీ ఇంతవరకూ వాటి పనులే పూర్తి చేయలేదు. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటికైనా తమకు ఇల్లు దక్కి కల నేరవేరుతుందా అని టిడ్కో ఇళ్ల లబ్దిదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అష్టకష్టాలు పడుతున్న టిడ్కో లబ్ధిదారులు - చేతులెత్తేసిన వైఎస్ జగన్ సర్కారు