Tirupatamma Kalyanotsavam: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లలో చోరీ ఘటన కలకలం రేపింది. భక్తులు ఒక్కసారిగా అమ్మవారికి అలంకరించిన పూలు, తలంబ్రాల కోసం ఏగబడ్డారు. ఈ క్రమంలో చోరీ జరిగినట్లు ఆలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో పోలీసులు చేతులెత్తేయడంతో చోరీ ఘటన జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
కల్యాణం వేదిక సామర్థ్యం 50 మందికేనని అధికారులు నివేదిక ఇస్తే.. అంతకు రెట్టింపు సంఖ్యలో మనుషులు పైకి ఎక్కారు. ఈ కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సతీసమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కొల్లా, కాకాని వంశీయులతో పాటు, ఎమ్మెల్యే, తదితర 7 జంటలు పీఠలపై కూర్చున్నాయి. పాలకవర్గ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు ఈ సారి అవకాశం ఇచ్చారు. వేదికపై ఉండే వ్యక్తుల జాబితాను దేవస్థానం అధికారులు పోలీసులకు అప్పగించారు. జాబితాలో పేర్లు, వేదిక పాస్ ఉన్నవారిని మాత్రమే పోలీసులు మొదట్లో అనుమతించారు.