అతనో కారు డ్రైవర్. బంగారు వ్యాపారైన యజమాని వద్ద ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నాడు. తరచూ రూ.లక్షల నగదును యజమాని వ్యాపార రీత్యా తీసుకెళ్లడాన్ని గమనించాడు. తన సమీప బంధువైన పాత నేరస్థుడి మాటలు విని యజమాని సొమ్మే కొట్టేయాలని భావించాడు. వీరికి ఓ కానిస్టేబుల్, వాలంటీర్, మరొకరు జత కలిసి ప్రణాళిక ప్రకారం రూ.50 లక్షలు దోచేశారు. గుడ్లూరు పీఎస్ పరిధిలోని శాంతినగర్ వద్ద ఆగస్టు 31న జరిగిన ఈ దోపిడీ కేసును కందుకూరు పోలీసులు ఛేధించారు. వివరాలను సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు.
ఏం జరిగింది...? ఎలా జరిగింది...?
గత నెల 31న నెల్లూరు జిల్లాకు చెందిన చిరంజీవి, అతని మిత్రుడు, బంగారు వర్తకులతో కలిసి కొంత నగదుతో బంగారు ఆభరణాలు కొనేందుకు విజయవాడ కారులో బయలుదేరారు. ప్రకాశం జిల్లా శాంతినగర్‌కు వచ్చే సమయానికి వీరు వెళ్తున్న కారును పోలీసులమని చెప్పి అడ్డగించారు. వ్యాపారులను ప్రశ్నించి, మీ దగ్గర లెక్కలు చూపని డబ్బు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.. మిమ్మల్ని ప్రశ్నించాలి.. డీఎస్పీ గారు పిలుస్తున్నారు..పోలీస్ స్టేషన్‌కు వెళదామంటూ వారిని నమ్మించారు. కారులో మాటల్లోకి దింపి, నల్లడబ్బు కాబట్టి కేసు పెడితే చాలా ఇబ్బందులు వస్తాయని, కేసు లేకుండా చేస్తామని రూ.25 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టారు. డబ్బు ఇస్తుండగా, నగదు సంచిని అపహరించుకుపోయారు. కత్తితో బెదిరించారు. ఆ సంచిలో రూ.50 లక్షలు నగదు ఉంది.. అయితే దొంగలు వెళ్తూ..వెళ్తూ వ్యాపారుల వద్ద లాకున్న వారి సెల్ఫోన్లను వారికే ఇచ్చి వెళ్లిపోయారు. ఈ పనే వారిని పోలీసులకు పట్టించింది. వ్యాపారులు సమయస్ఫూర్తితో నిందితులు పారిపోయిన కారు ఫోటో తీశారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత అంటే.. ఈ నెల 3న బంగారు వ్యాపారులు గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి.. కారు ఫొటోలను అందజేశారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతికతను వినియోగించే కారు ఆచూకీ కనుగొన్నట్లు ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్ వివరించారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.47 లక్షల నగదు, రెండు కార్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.