వాళ్లంతా మద్యం మహమ్మారికి బానిసలైన నిరుపేదలు.. పగలంతా కష్టపడి రాత్రయ్యేసరికి మద్యం తాగడానికి అలవాటు పడిన వాళ్లు. సమయానికి మద్యం తీసుకోకపోతే.. తలనొప్పి, ఒళ్ళంతా వణుకు వస్తుందని... అందుకు ఎక్కడ మద్యం ఉన్నా తాగాల్సిందేననని భావించేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో శానిటైజర్లు తాగి 13 మంది పిట్టల్లా రాలిపోయారు. ప్రకాశం జిల్లాలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన సంచలనంగా మారింది.
ధరల మంట...అందులో లాక్ డౌన్
అసలే రాష్ట్రంలో మద్యం ధరలు మండుతున్నాయి. దీనికితోడు లాక్ డౌన్ విధింపుతో మద్యం కరవైంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు శానిటైజర్లలో ఆల్కహల్ ఉంటందనే విషయాన్ని తెలుసుకున్నారు. ధర చూస్తే తక్కువే... ఇంకేముంది..అంతో ఇంతో పెట్టి కొనుగోలు చేయటం...వాటిలో నీళ్లను కలుపుకుని తాగటం మొదలుపెట్టారు. గత రెండు మూడు వారాలుగా జిల్లాలోని కురిచేడు గ్రామానికి చెందిన పలువురు ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత గ్రామంలో ఉండే ఇద్దరు యాచకులు చనిపోగా...తరువాత 8 మంది మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరిస్తున్నారు.
గురువారం కురిచేడు గ్రామంలో ఇద్దరు మృతి చెందగా సాధారణ మరణాలుగా భావించి వారిని ఖననం చేశారు. అయితే వారు కూడా ఇలా శానిటైజర్లు సేవించడం వల్లనే మృతి చెందారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రాణం విడిచే ముందు తీవ్రమైన తలనొప్పి, కడుపులో నొప్పి, వాంతులు వచ్చి చనిపోయారని బంధువులు పేర్కొన్నారు.