ఒంగోలు శివారు మండువవారిపాలెం వద్ద ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెదేపా మహానాడు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. తొలి రోజైన 27న ప్రతినిధుల సభ జరగనున్న ప్రాంగణంలో వేదిక, జర్మన్ హేంగర్ (షెడ్డు) ఏర్పాటు పూర్తయింది. ఎయిర్‌కూలర్ల ఏర్పాటు, మీడియా పాయింట్ పనులు కొనసాగుతున్నాయి. తొలిరోజు 12వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండోరోజు ఈ సంఖ్యను పెంచనున్నారు. అలానే దాదాపు 500 మందికి పైగా నాయకులు కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. 28న జరిగే బహిరంగ సభకు జర్మన్ షెడ్‌ను తీసివేస్తారా, అలానే ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ చిత్రాలతో ఏర్పాటుచేసే ఫొటో గ్యాలరీకి తుది మెరుగులు దిద్దుతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న అరుదైన చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.
భారీగా తెదేపా శ్రేణులు వస్తున్నందున ఎటువంటి ఇబ్బందీ కలగకుండా భోజన ప్రాంగణం రూపుదిద్దుకుంది. మహానాడు ప్రాంగణంలో విద్యుత్తు వెలుగులు విరజిమ్మేలా లైట్లు, పార్టీ అధినాయకుల ఫొటోలతో భారీ కటౌట్లు ఏర్పాటుచేస్తున్నారు. నలువైపులా అందరికీ కనిపించేలా 30ఎంఎం ఎల్‌ఈడీ తెరల ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నారు. ప్రాంగణానికి కాస్త దూరంగా ఒకవైపు బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మహానాడుకు.. చంద్రబాబు ఒక రోజు ముందే బయల్దేరి వెళ్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తెదేపా జాతీయ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఒంగోలుకు బయల్దేరి వెళ్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఒంగోలులో జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.