జనావాసాల మధ్యనున్న ఓ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం స్థానికుల పాలిటశాపంగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని భగీరథ అనే రసాయన పరిశ్రమ వెలువరించే వ్యర్థాలు చుట్టుపక్కల గ్రామాలను కాలుష్య కాసారంగా మార్చేసింది. ఫలితంగా చెరువుకొమ్మపాలెం, వెంగముక్కపాలెం, తుఫాన్ పాలెం గ్రామాల ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ పరిశ్రమతో సమీపంలోని జలవనరులన్నీ పూర్తిగా కలుషితమయ్యాయని గ్రామస్థులు చెబుతున్నారు. నీటి కాలుష్యం కారణంగా ఉన్న ఊరిని వదిలి ఇతర ప్రాంతాలకు మకాం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ కారణంగా చుట్టు పక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆ పరిశ్రమ... అక్కడి ప్రజలను భయపెడుతోంది! - water
బోరులో వచ్చే నీళ్లు పెట్రోలును తలపిస్తున్నాయి. భూగర్భ జలాలన్నీ కాలుష్య కాసారంగా మారిపోయాయి. కిడ్నీ, చర్మవ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం అమాయక పల్లె ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తోంది.
పరిశ్రమ
పరిశ్రమలో విడుదలయ్యే రసాయన వ్యర్థాలు నీటి కుంటల్లోకి మళ్లిస్తున్నారు. ఆ నీరు భూగర్భంలోకి ఇంకి చుట్టు పక్కల ప్రాంతాల జల వనరులు కలుషితమవుతున్నాయి. ఫలితంగా చర్మ సంబంధ, కిడ్నీ వ్యాధులతో గ్రామస్థులు భీతిల్లుతున్నారు. బోరు నుంచి వచ్చే నీరు పెట్రోలు, డీజిల్ రంగులోకి మారిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రసాయన పరిశ్రమను దూరంగా తరలిస్తే తప్ప తమ జీవితాలు బాగుపడవని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.