ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండు గోడల మధ్య చిక్కుకుపోయిన చిన్నారిని అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. ఇందిరమ్మ కాలనీ రెండో లైన్లో మీనాక్షి అనే ఆరేళ్ల బాలిక ఆడుకుంటూ రెండు గోడల మధ్యకు వెళ్లింది. ఇరుకైన గోడలు కావడం వల్ల తిరిగి రాలేక అవస్థ పడింది.
ఆ చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు... అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది హుటాహుటిన వచ్చి.. ఒక ఇంటి గోడను పగలగొట్టి చాకచక్యంగా బాలికను బయటకు తీశారు. దాదాపు గంటసేపు శ్రమించి చిన్నారిని బయటకు తీసుకురావటంతో అంతా ఊపిరి తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కృషిని స్థానికులు అభినందించారు.