ruling party attacks : అధికార పార్టీ నేతల దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు రోజు రోజుకూ మితిమీరి పోతున్నాయి. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట ఈ భూ కబ్జాల పర్వం కొనసాగుతునే ఉంది. ఇలాంటి ఘటనే మరొకటి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్వీకేపీ కళాశాలల ఎదుట రహదారి పక్కన పట్టణానికి చెందిన కొందరు నిరు పేదలు దాదాపు 65 ఏళ్ల కిందట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరు విద్యుత్ బిల్లులతో పాటు పురపాలక సంఘానికి ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నారు.
స్థలాలు కబ్జా...ప్రస్తుతం భూముల ధరలు భారీగా పెరగడంతో ఆ పేదల ఇళ్లపై అధికారపార్టీ నాయకుల కన్ను పడింది. కొందరిని బెదిరింపులకు గురి చేసి చిన్న మొత్తంలో నగదు ఇచ్చి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో షేక్ మహమ్మద్ మన్సూర్ అనే వ్యక్తి తన స్థలాన్ని ఇవ్వబోనని తెగేసి చెప్పాడు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు రగిలిపోయారు. ఇవ్వకపోతే రాత్రికి రాత్రే ఇంటిని కూల్చేస్తామని తెగేసి చెప్పారు. దీంతో బాధితుల భయబ్రాంతులకు గురౌతున్నారు. ప్రతి రోజూ ఎవరో ఒకరు వచ్చి బెదిరిస్తున్నారని... చాలా అన్యాయమని వాపోయారు.