ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామన్నపేట సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మద్దతుతో మద్దాలి రేచల్ చెంచులక్ష్మి నామపత్రాలు అందజేశారు. కాగా... పాఠశాల తల్లిదండ్రుల కమిటీలో ఆమె సభ్యురాలైనందున పోటీకి అనర్హురాలని వార్డు సభ్యునిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మద్దతుదారుడు బట్ట లీలానంద ప్రసాద్.. ఆర్వో చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన అనుచరులు కూడా అక్కడకు రావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నీ నామపత్రాలు ఆమోదించినట్లు ప్రకటించాక...ఆమె నామినేషన్ చెల్లదని ఎలా చెపుతారని ఆర్వోను ప్రశ్నించారు.
రామన్నపేటలో ఉద్రిక్తత - Tensions in Ramannapeta
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ విషయంలో...మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి, ఎమ్మెల్యే బలరాం వర్గానికి మధ్య వాగ్వాదం జరిగింది.
మరోవైపు ఆమె అనర్హతకు సంబంధించిన ఆధారాలన్నీ సమర్పించినందున పరిశీలించాలని ఫిర్యాదుదారుడు ఆర్వోను అడిగారు. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో పోలీసులు అప్రమత్తమై... బయటవారిని కార్యాలయం వైపు రాకుండా అడ్డుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఆర్వో కార్యాలయంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. చివరకు పోలీసులు కలగజేసుకుని అందరిని బలవంతంగా బయటకు పంపించారు. అనంతరం రామన్నపేట పంచాయతీ సర్పంచ్ పదవికి 7, వార్డు సభ్యులకు 74 నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని..అన్నీ ఆమోదించినట్లు ఆర్వో చంద్రశేఖర్ ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీరాల గ్రామీణ, ఒకటి, రెండో పట్టణ సీఐలు రోశయ్య, పాపారావు, రాజమోహన్, వేటపాలెం ఎస్.ఐ కమలాకర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:ఒక్క ఓటు లేని పల్లెను చూశారా..?