TDP Youth Leader Lokesh Yuvagalam Padayatra Updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర ప్రకాశం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో నారా లోకేశ్.. వివిధ సామాజికవర్గాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ.. వారి సమస్యలను సావధానంగా వింటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఏయే కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టనున్నారో తెలియజేస్తూ.. ముందుకు సాగుతున్నారు.
161 రోజులు పూర్తి చేసుకున్న యువగళం..టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర శుక్రవారానికి 161వ రోజుకు చేరుకుంది. నేటి పాదయాత్రను లోకేశ్.. ప్రకాశం జిల్లా ఎర్రఓబనపల్లి నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం ఎర్రఓబనపల్లిలో కమ్మ సామాజిక వర్గంతో ఆయన ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో.. జగన్ ప్రభుత్వంలో కమ్మ సామాజికవర్గానికి జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలు, ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతున్నారన్న విషయాలతోపాటు మరికొన్ని సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజలను వేధించిన ఎవరినీ వదిలిపెట్టను.. నారా లోకేశ్ మాట్లాడుతూ..''చంద్రబాబు నాయుడు రాముడు లాంటివారు.. నేను రాముణ్ని కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను వేధించిన ఎవరినీ వదిలిపెట్టను. 39 మంది కమ్మ సమాజానికి డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని అబద్ధం చెప్పారు. ఒక దొంగ.. సమాజంలోని అందరినీ దొంగలుగా చిత్రీకరించాలని అనుకుంటాడు. ప్రభుత్వంపై ఎవరు మాట్లాడినా అక్రమ కేసులు పెడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 65 కేసులు, నాపై 20 కేసులు పెట్టారు. ఎక్కడా లేని వేధింపులు ఏపీలోనే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు కేసులు.. జైళ్లు. సన్నబియ్యం సన్నాసి ఒకరు నా తల్లిని అవమానించారు. నోటికొచ్చినట్లు తిడితే భయపడతామని అనుకుంటున్నారు. 16 నెలలు ఆయన జైలుకెళ్లారు.. ప్రజలందరినీ అలాగే పంపాలనుకుంటున్నారు. పైకి వస్తున్న వాళ్లను అణగదొక్కడమే జగన్ పని. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ రాని పరిస్థితి. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే టీడీపీప్రయత్నం.'' అని ఆయన అన్నారు.
కార్పొరేషన్ పెట్టాడే తప్ప నిధులు ఇవ్వలేదు.. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరినీ అభివృద్ది చేయడమే.. టీడీపీ లక్ష్యమని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిని జగన్ కమ్మరావతిగా ప్రచారం చేశారని మండిపడ్డారు. జగన్.. కమ్మ కార్పొరేషన్ పెట్టాడే తప్ప నిధులు, విధులు ఇవ్వలేదని లోకేశ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజికవర్గంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సైతం జగన్ రెడ్డి వేధిస్తున్నాడని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి రాత్రిపూట ఆత్మలతో మాట్లాడుతాడు. అలా మాట్లాడే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాడు. అలాంటి చిల్లర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేయలేదు. ఏపీ నంబర్ 1గా ఉండాలనేది టీడీపీ అజెండా. జగన్.. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు. కానీ, చంద్రబాబు నాయుడు కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అభివృద్ది చేశారు.-నారా లోకేశ్, టీడీపీ యువనేత
ప్రజలను వేధించిన ఎవరినీ వదిలిపెట్టాం: లోకేశ్