TS LETTER TO CENTRAL: వెలిగొండకు కేంద్రం నిధులపై తెలంగాణ అభ్యంతరం - velugonda project latest updates
12:13 August 27
వెలిగొండ ప్రాజెక్టుకు అర్హత ఉందో లేదో పరిశీలించాలని విజ్ఞప్తి
రాష్ట్రంలో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇచ్చే విషయమై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖలోని స్టేట్ ప్రాజెక్ట్స్ వింగ్ కమిషనర్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. వరద జలాల ఆధారంగా కృష్ణానదిపై ఏపీ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ కేటాయింపులు లేవని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్లోనూ.. అనుమతుల్లేని వాటి జాబితాలో వెలిగొండ ప్రాజెక్టు ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్.. కృష్ణా జలాలను బేసిన్ వెలుపలకు తరలిస్తోందని గతంలోనే ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అనుమతుల్లేని ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఏఐబీపీ కింద నిధులు ఇవ్వడం ఏ మేరకు సబబన్న తెలంగాణ.. పీఎంకీఎస్వై-ఏఐబీపీ కింద నిధులు ఇచ్చేందుకు వెలిగొండ ప్రాజెక్టుకు అర్హత ఉందో లేదో పరిశీలించాలని కోరింది.