ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్లో లోపాలు, వారి సమస్యలను పరిష్కరించాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేశాయి. ఉపాధ్యాయ కౌన్సిలింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని, వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మెన్యువల్లో కౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐక్య ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా లో 10శాతం మేర పోస్టులు బ్లాక్ చేశారని, వీటిని తెరిచి ఖాళీల లిస్ట్లు జత చేయాలని డిమాండు చేస్తూ నిరసనలు చేపట్టారు. నిరసనకు అనుమతించిన సమయం పూర్తయిందని, బయటకు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించినా , సమస్యపై ఆందోళన కొనసాగించారు. వారిని పోలీసులు బయటకు లాగే ప్రయత్నంలో కొంత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇరూ వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కొంతమంది ఉపాధ్యాయులను పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు.