Teacher committed suicide: ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ.. రాసిన సూసైడ్ లేఖ కలకలం రేపుతోంది. తనకు అప్పుల బాధలు ఎక్కువయ్యాయంటూ.. రాజారపు లక్ష్మయ్య అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అప్పుల బాధలు ఎక్కువయ్యాయని ఉపాధ్యాయుడు లేఖలో రాశారు. మార్కాపురం చెరువు గట్టుపై సూసైడ్ లేఖతో పాటు దుస్తులు, చెప్పులు ఉన్నాయి. అతని కోసం ఈతగాళ్లు, పోలీసులు గాలిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా చేస్తున్నా కూడా అప్పులు ఎందుకయ్యాయి.. ఏమైనా వ్యాపారాలు చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
తేదీ 8/5/23 సోమవారం ఉదయం 5 గంటలకు మార్కాపురం చెరువులో ఆత్మహత్య చేసుకుంటున్నాను. కారణం నాకు ఇవ్వవలసిన వారు ఇవ్వకపోవడం. అలాగే నేను ఇవ్వవలసిన వారు వెంటపడటం వలనే నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. నా శవం దొరికితే కాల్చివేయండి. లేకపోతే లేదు. నా ఆనవాలు మాస్టర్ బొమ్మ, ఫొటో, మా ముఖ్యమైన వారి ఫోన్ నంబర్స్ నోట్, చెప్పులు చెరువు గట్టుపై గలవు. ఇవి అన్నీ ఆకుపచ్చ సంచిలో కలవు. ఇట్లు...రాజారపు లక్ష్మయ్య, ఎస్ఏ మ్యాథ్స్, జేడ్పీహేచ్ బాలికల పాఠశాల , 6వ వార్డ్, మార్కాపురం, శ్రీరామచంద్ర మిషన్ ప్రిసిప్టేర్ అని సూసైడ్ నోట్లో వివరాలు పేర్కొన్నాడు.
పరీక్షల్లో ఫెయిల్ అయిందని.. పదో తరగతి ఫెయిల్ అయిందని మనస్థాపంతో ఓ విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్న.. ఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెండ్లిమరి మండలం మాచనూరు గ్రామానికి చెందిన పొలతల అనూష అనే విద్యార్థిని శనివారం వచ్చిన పదో తరగతి పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిందనే.. మనస్థాపంతో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేలుకుంది.. విద్యార్థిని చౌటపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతుంది.. రోజువారీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు(ఆంజనేయులు, శాంతకుమారి) కన్నీరు మున్నీరుగా విలపించడం గ్రామస్థులను కలచివేసింది. విషయం తెలిసిన వెంటనే మండల రెవెన్యూ అధికారి ఉదయ భాస్కర్ రాజు ఘటనా స్థలానికి వెళ్లి వారిని విచారించడం జరిగింది.
ఈతకు వెళ్లి యువకుడు మృతి.. జిల్లాలోని మరోచోట యువకుడు ఈతకు వెళ్లి ఇసుక గుంతలో ఇరుక్కుపోయి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరుపునాయన పల్లె మండలం అనిమల్ గ్రామంలో హరీష్(17) అనే యువకుడు స్నేహితులతో కలిసి పాపాగ్ని నదిలో ఈతకు వెళ్లారు అక్కడ ఇసుక గుంతలో ఇరుక్కుని మృతి చెందాడు. యువకుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అన్నను చంపిన తమ్మడు..అర్ధరాత్రి ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వాగ్వాదం హత్యకు దారి తీసింది. ఈ ఘటన కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుమ్మరి కుంటకు చెందిన ఇషాక్ 12 గంటల అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో అన్న అబ్బు తమ్ముడి కోసం గాలిస్తూ ఉన్నాడు. ఇషాక్ పెద్ద దర్గా వద్ద ఉన్నాడని తెలియడంతో అన్న అబ్బు అక్కడికి వెళ్ళాడు. ఇంత రాత్రి అయినప్పటికీ ఇంటికి ఎందుకు రాలేదంటూ మందలించాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. గొడవ తారస్థాయికి చేరడంతో తమ్ముడు కోపాన్ని ఆపుకోలేక తన వద్ద ఉన్న కత్తి తీసుకొని పొడవడంతో అబ్బుకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.