తెలుగుదేశం పార్టీ కార్యాలయం, నాయకులపై వైకాపా శ్రేణులు చేసిన దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లాలో బంద్ జరిగింది. ఉదయాన్నే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని నిరసనలు చేపట్టారు. డిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
మార్కాపురం ఆర్టీసీ డిపో వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. నిన్న తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో డిపో గేట్ వద్ద బైఠాయించారు. బస్సులను బయటకి పోనివ్వకుండా బస్సులను అడ్డుకున్నారు. కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెల్లవారు జామున 4 గంటల నుంచి తెదేపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. నినాదాలు చేస్తూ బస్సులను బయటకు వెళ్లనీయకుండా బంద్ చేపట్టారు. బంద్‌కు అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, తెదేపా కార్యాకర్తలను మధ్య వాగ్వాదం జరిగింది. పర్చూరు మండలం నాగులపాలెంలో తెదేపా నేత ఏలూరి సాంబశివరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. బొమ్మల కూడలిలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. పామూరులో తెదేపా నేతలు చేపట్టిన బంద్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తెదేపా నాయకులను పోలీసులు ముందుగా గృహ నిర్బంధం చేశారు. యర్రగొండపాలెంలో తెదేపా ఇంచార్జ్ ఏరీక్షన్ బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొలుకుల సెంటర్ నుంచి ర్యాలీగా వస్తున్న తెదేప శ్రేణులను పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.