వేధింపులు పెచ్చుమీరాయి.... గవర్నర్ జోక్యం అవసరం: చంద్రబాబు
తమిళనాడులో చిక్కిన సొమ్ముపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అసలు విషయాన్ని విడిచి పెట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వాళ్లను వేధించడమేంటని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికార పార్టీ వేధింపులు పెచ్చు మీరుతున్నాయని గవర్నర్‌కు లేఖ రాశారు. వేధింపులు, చట్ట విరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధమైన అరెస్టులు, అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ హరించివేస్తోందని విమర్శించారు.
5.27 కోట్ల రూపాయలు పట్టుబడి 72 గంటలకు పైగా గడిచిపోయింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా నాయకులపై తప్పుడు కేసులను మాత్రమే వేసే బాధ్యతను వారు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీ సభ్యులతో సంబంధం ఉండి అవినీతి, మనీలాండరింగ్ కు పాల్పడేవారిపై ఏసీబీ ఉదాసీనంగా వ్యవహరిస్తుందా? అని నిలదీశారు.
బాలినేనిపై తమిళనాడు మీడియా కోడై కూసింది
బాలినేనిపై తమిళనాడు అంతటా మీడియాలో ప్రసారమయ్యాయని... నగదు రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టి సందీప్, చంద్రశేఖర్‌ను వేధించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మూడు స్టేషన్లు తిప్పుతూ దారుణంగా కొట్టి భౌతికంగా హింసించారని ఫిర్యాదు చేశారు. సత్వర న్యాయం అందించేలా గురుతర జోక్యం తక్షణ అవసరమని గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ జోక్యం సమాజంలోని వ్యవస్థల విలువలపై విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.
ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రకాశం జిల్లా ఎస్పీకి కూడా చంద్రబాబు లేఖ రాశారు. పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో వారిని హింసించటం తగదంటూ హితవు పలికారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇలా చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టు చేసిన సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రికి సంబంధించిన నగదు వ్యవహారంపై తమిళనాడు మీడియాలో ప్రసారమైందని.. ఆ విషయంలో ఏపీలో ఎందుకు తనిఖీలు చేయలేదనే సందీప్, చంద్రశేఖర్ ప్రశ్నించారని తెలిపారు.
సమగ్రదర్యాప్తు జరగాలి
చెన్నైలో దొరికిన నగదుపై దర్యాప్తు చేపట్టాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. వెలుగులోకి తెచ్చిన సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులా? అంటు నివ్వెర పోయారు. పట్టుబడిన నగదుపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చెన్నైలో ఉన్న జగన్ కుటుంబానికే ఈ నిధులు తరలించారని ఆరోపించారు.