ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెదేపా నేత కందుల నారాయణరెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. స్వగ్రామంలోని ఇంటి వద్దే కుమార్తె భవ్యనందినితో కలిసి నిరసన చేపట్టారు. వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలని కోరుతూ నియోజకవర్గంలోని రోజుకో గ్రామంలో కాగడాల ప్రదర్శన చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో గజ్జలకొండకు వెళుతున్న నారాయణరెడ్డిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ.. నారాయణరెడ్డి ఇంటి వద్దే ధర్నాకు దిగారు. ఈ సమయంలో తెదేపా కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అనుమతించకపోవడంతో ఆయన ఇంటివద్దే కాగడాలతో నిరసన తెలియజేశారు. ఏదేమైనా తాను ఉద్యమాన్ని ఆపబోనని అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. నికర జలాల విషయంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ప్రాజెక్టుకు నీటిని సాధించి తీరుతామన్నారు.