తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులోని తెదేపా కార్యాలయం నందు వేడుకలను పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నుకసాని బాలాజీ హాజరయ్యారు. తెదేపా నాయకులు కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.
గిద్దలూరులో..
తెదేపా ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గిద్దలూరు తెదేపా కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు.
తెలుగువారి ఖ్యాతి తెలుగువారి సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కొనియాడారు. కేవలం రెండు రూపాయలకే పేదలకు బియ్యాన్ని అందించడంతో పాటు.. ఆయన చేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజలకు ఆరాధ్యదైవంగా మారారని తెలిపారు. చరిత్ర ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాల ప్రజలు నందమూరి తారక రామారావును గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు.
కనిగిరిలో
కనిగిరి పట్టణంలో తేదేపా పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలను తేదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మొదటగా తేదేపా కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కనిగిరి పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో తేదేపా జెండాలను ఎగురవేసి నినాదాలు చేశారు.