ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాలో సంస్థాగత సందడి.. - ప్రకాశం జిల్లాలో తెదేపా కమిటీలు న్యూస్

తెదేపాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు స్థానాలు దక్కాయి. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి కొందరు సీనియర్ నాయకులు దూరం కావడం, అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించి.. కష్టాలలో కాడే వదిలేసి పోవడం, మరి కొందరు పార్టీలోనే ఉన్నా క్రియాశీలంగా లేకపోవడం లాంటి అంశాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిణామాలపై అధినాయకత్వం దృష్టిసారించింది.

tdp  committees arrangement in prakasham
tdp committees arrangement in prakasham

By

Published : Oct 27, 2020, 3:20 PM IST

లోక్​సభ నియోజకవర్గాన్ని యూనిట్​గా తీసుకుని తెదేపా ఇటీవలే అధ్యక్షులను ప్రకటించింది. ఇందులో పలువురి పేర్లు వినిపించినా వ్యూహాత్మకంగా ఒంగోలు అధ్యక్షుడిగా సూకసాని బాలాజీ, బాపట్ల అధ్యక్షుడిగా ఏలూరి సాంబశివరావును నియమించి సమతూకం పాటించింది. అలానే సాధ్యమైనంత త్వరగా జిల్లా కమిటీతో పాటు అన్ని అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని మార్గనిర్దేశం చేసింది. అయితే ప్రకాశం జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే కొన్ని మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. కొన్నింటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే పార్టీ అధికారంలో లేకపోవడం, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మండల, గ్రామ కమిటీల పదవులకు పోటీ ఎంతవరకు ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

అధినాయకుడి ఆదేశాలతో...

ఐదురోజుల క్రితం తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జూమ్ యాప్ ద్వారా ఒంగోలు లోకసభ నియోజకవర్గ తెదేపా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్​ఛార్జ్​లను నియమించడం, అలానే మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకోవాలని, అండగా ఉండే నాయకులు, కార్యకర్తలను తయారు చేసుకుని వైకాపా అరచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధినాయకుడు దిశానిర్దేశం చేశారు. దసరా పండుగ మరుసటి రోజే ఒంగోలు, బాపట్ల అధ్యక్షులు సన్నద్ధం అయ్యారు.

పర్చూరులో మొదలు...

బాపట్ల తెదేపా అధ్యక్షుడైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పర్చూరు నియోజకవర్గంలో శ్రీకారం చుట్టి... బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటు పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలో పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన, గ్రామ కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈ నెల 29 నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో సమావేశాలు ఉంటాయన్నారు. 29న ఉదయం 10 గంటలకు మార్టూరు. సాయంత్రం 3కి యద్దనపూడి, 30న ఉదయం 10గంటలకు చినగంజాం, సాయంత్రం 3కు ఇంకొల్లు, 31న ఉదయం 10కి పర్చూరు, సాయంత్రం 3 గంటలకు కారంచేడులో మండల కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ మండల కమిటీల సమావేశాలకు ఎన్నికల అబ్జర్వర్లుగా మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు సలగల రాజశేఖర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కరీముల్లా, గుంటూరు జిల్లా తెదేపా కార్యనిర్వాహక కార్యరర్శి సలజాల శ్రీనివాసరావు హజరవుతారని చెప్పారు. ఈ ఐదు రోజుల్లో పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఒంగోలు పరిధిలో సన్నద్ధం...

ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే ఉన్న కమిటీలపై సమీక్షించుకుంటున్నామని, పార్టీ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గాల వారీగా అన్ని మండల, గ్రామ కమిటీలను త్వరలో పూర్తి చేస్తామని ఒంగోలు అధ్యక్షుడు నూకసాని బాలాజీ తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పరిశీలకుల నియామకం జరుగుతోందని, షెడ్యూలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ముందుగా దర్శి ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రారంభిస్తామని ఇందులో భాగంగా త్వరలో ఇన్​ఛార్జ్​ల నియామకం చేపడుతామన్నారు. అన్ని కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుని క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యకలాపాలపై పోరాటాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తామని బాలజీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:పైడితల్లి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details