ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు ఆర్ఐ గోపి, వీఆర్వో కోటయ్యలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ భూములను తమ కుటుంభ సభ్యులతో పాటు ఇతరులకూ భారీగా కట్టబెట్టినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ అధికారిగా వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ సరళ వందనంను విచారణ అధికారిగా నియమించారు. పది రోజుల పాటు రికార్డులను క్షుణ్నంగా పరిశీలించిన ఆమె.. నివేదికను కలెక్టర్కు అందజేశారు. ఆర్ఐ గోపి, వీఆర్వో కోటయ్య లను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
మార్కాపురం మండలంలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టడంలో ఆర్ఐ గోపి కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. వీఆర్వో కోటయ్య తమ కుటుంబ సభ్యుల పేరిట 14 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఆన్లైన్ కు ఎక్కించుకున్నారు. వీరితో పాటు మార్కాపురం మండలంలో మరి కొందరు వీఆర్వోలు, కంప్యూటర్ ఆపరేటర్ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వారిపైనా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.