ప్రకాశం జిల్లాకు చెందిన 21 మంది వలస కూలీలు తమిళనాడులో అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి, ఉండడానికి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 200 మంది వలస కూలీలు తమిళనాడు పుదుకొట్టై జిల్లా అరంగతంగిలోని ఓ చక్కెర కర్మాగారంలో పని చేసేందుకు వెళ్లారు. వీరిలో చాలామంది ఒక నెలలోపు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయారు. 21 మంది మాత్రం పనికోసం అక్కడే ఉన్నారు. మార్చి చివర్లో లాక్డౌన్ విధించటంతో చిక్కుకుపోయారు.
వారందరూ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఉంటున్నారు. ప్రభుత్వాలు తమకు ఏ మాత్రం సాయం అందించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చనిపోయిన పట్టించుకునేవారు లేరని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై ఈటీవీ భారత్ ప్రతినిధి పుదుకొట్టై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా... కొన్ని రోజుల్లో వారందరినీ స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు.