ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పల్లా గోపాల్, ప్రసన్నలు భార్యాభర్తలు. గోపాల్ చిక్కీల పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే అతనికొచ్చే సంపాదనతో ఇల్లు సరిగ్గా గడిచేది కాదు. ఈ సమయంలోనే ప్రసన్న మదిలో ఓ ఆలోచన వచ్చింది. భర్తకు తను చేసే పనిలో ఎంతో అనుభవం ఉంది. కాబట్టి తామే సొంతంగా వ్యాపారం పెట్టాలనుకుంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. అతను బాగా ఆలోచించి భార్య ఆలోచనలకు కార్యరూపం ఇచ్చాడు. అప్పు చేసి, చిన్న స్థలం అద్దెకు తీసుకుని ఐస్‌క్రీమ్‌లలో ఉపయోగించే చిక్కీల వ్యాపారం మొదలుపెట్టాడు.
తనూ, భార్య, మరో సహాయకుడు వీరితోనే వారి చిక్కీల యూనిట్ ప్రారంభమైంది. మొదట్లో మార్కెటింగ్‌కి కొంత ఇబ్బందిపడ్డారు. అయితే గోపాల్ ఒక్కో ఐస్ ఫ్యాక్టరీకి వెళ్లి చిక్కీలు అమ్మేవాడు. భార్య పరిశ్రమ నడిపిస్తుంటే, గోపాల్ మార్కెటింగ్ చూసుకునేవాడు. వారి సరకు నాణ్యత బాగుండటంతో ఆర్డర్లు పెరిగాయి. అంకితభావంతో పనిచేస్తూ, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ నేడు వారు మరో 10 మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగారు.
బెల్లం, జీడిపప్పు, నెయ్యిని పాకం పట్టి, వాటి నుంచి చిక్కీల పొడి తయారు చేస్తారు. కిలోల లెక్కన ప్యాక్ చేసి ఆర్డర్ల ప్రకారం అనుకున్న సమయానికి ఐస్ ఫ్యాక్టరీలకు అందిస్తారు. భార్యాభర్తల శ్రమకు ఫలితంగా ఆర్డర్లు పెరగటంతో సొంతంగా స్థలం కొని, యూనిట్‌ను పెంచారు. మెప్నా, ముద్ర ద్వారా లభించిన రుణం యూనిట్ విస్తరణకు ఉపయోగపడిందని తెలిపారు. ఇప్పుడక్కడ 10 మంది మహిళలకు పని లభించింది. వీరంతా రోజుకు రూ. 300 నుంచి రూ. 700 వరకు సంపాదిస్తున్నారు.