వసతిగృహాలా జైళ్లా? విద్యార్థులకు కనీస సౌకర్యాలు పట్టించుకోని ప్రభుత్వం - చలికి వణుకుతూ నేలపైనే నిద్ర Students Sleeping on the Floor in Government Hostels:మన పిల్లలైతే కటిక నేలమీద పడుకోబెడతామా? కనీసం మెత్తటి పరుపులైనా సమకూర్చలేమా? అంటూ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. నిజమే ప్రభుత్వం నిర్వహిస్తున్న వెనుకబడిన, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితి చూస్తే విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం అవుతుంది. ఆ ఇబ్బందులను కూడా వారు అలవాటు చేసుకొని చదువులు సాగిస్తున్నారంటే వారి మానసిక స్థితిని ఎంత కుచించివేసారో అర్థం అవుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పలు వసతి గృహాలను పరిశీలిస్తే విద్యార్థులు ఇబ్బందులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి.
పేరుకే వసతి గృహం కనీస సౌకర్యాలూ గగనం - గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సమస్యల తాండవం
వసతి గృహాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. పురాతన, శిథిలావస్థలో ఉన్న వాటిలోనే పిల్లలను పెడుతున్నారు. ఏ వసతి గృహంలోకి వెళ్ళినా విద్యార్థులు నేలమీదే పడుకుంటున్నారు. ఓ పలుచటి వస్త్రాన్ని పరుచుకొని దానిమీదే వారి నిద్ర సాగిస్తారు. మంచాలు కాదు కదా.. కనీసం మెత్తటి పరుపులు కూడా వారికి అందివ్వలేని దుస్థితి ప్రభుత్వాలవి.. మురుగునీటి ప్రవాహం సరిగా లేక, వర్షం వస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దోమలు కుడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఇలాంటి దుస్థితిలో విద్యార్థులు ఉంటున్నారు.
కింద పడుకోవాల్సి వస్తే మన పిల్లల్ని హాస్టల్స్లో చేరుస్తామా- ప్రభుత్వంపై హాకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కిటీకీ తలుపులు విరిగి, కనీసం దోమతెరలు లేని దుస్థితిలో వసతిగృహాలు ఉన్నాయి. కొన్నిచోట్ల అద్దె భవనాలు తీసుకొని వసతిగృహాలు నిర్వహిస్తున్నా వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు, స్నానాల గదులు ఉండటంలేదు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మంచాలు వాటిపై పరుపులు అందిస్తారు. బెడ్ షీట్లు, దుప్పట్లు సరఫరా చేస్తారు. కానీ సంక్షేమ వసతి గృహాల్లో మాత్రం విద్యార్థులకు ఇలాంటివి మచ్చుకు కూడా అందివ్వడం లేదు. నాడు నేడు అంటూ బాగున్న పాఠశాలలను సైతం పడగొట్టి , కొత్త నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వం వసతి గృహాల విషయంలో నిర్లక్ష్యం చూపుతుంది.
నేల మీదే పడక, కనీసం దుప్పట్లు లేని పరిస్థితి - సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో దయనీయ స్థితిపై హైకోర్టు విస్మయం
జగన్ మామ పాలనలో దుప్పట్లనే పరుపులుగా భావిస్తున్న విద్యార్థులు.. పాఠశాలలు తెరిచిన ఐదు నెలలు తరువాత ఇటీవల దుప్పట్లు పంపిణీ చేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. జగన్ మామ పాలనలో వాటిని విద్యార్థులు పరుపులుగా భావిస్తున్నారు. పేద విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు వసతి గృహాలను సందర్శిస్తే విద్యార్థులు పడే ఇబ్బందులు తెలుస్తాయని చెబుతున్నారు. కోర్టులతో చెప్పించుకోకుండా ప్రభుత్వం కనీస బాధ్యతతో వ్యవహరించాలని.. పేద పిల్లలకు సౌకర్యాల కల్పన విషయంలో నిర్లక్ష్యం తగదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎవరో చెపితే కాదు ప్రభుత్వానికి కనీస బాధ్యత ఉండాలి పేద పిల్లలకు అడగలేరని సౌకర్యాలు కల్పన విషయంలో నిర్లక్ష్యం చూపడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు.