'నిఖిలం నవతః- చరమం దశతః' ఇదేదో మాయా మంత్రంలా అనిపిస్తుంది కదూ. కానీ ఇది వేద గణితంలోని ఓ సూత్రం. గణితంలోని సమస్యలను క్షణాల్లో సాధించడానికి అవసరమైన టెక్నిక్‌ను ఈ వేద గణితం నేర్పుతుంది. అలాగే సబ్జెక్టును విద్యార్థులు సులభరీతిలో అర్థం చేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఆర్యభట్ట, వేదవ్యాసులు, వాల్మీకి, పోతన, శ్రీనాధుడు కాలంలో ఓ వెలుగు వెలిగింది వేద గణితం. కాల క్రమేణా మూలకు చేరింది. మళ్లీ ఇప్పుడు ఈ వేద గణితం నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వేద గణితంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. క్లిష్టమైన లెక్కలను సైతం చిటికెలో అవలీలగా పరిష్కరిస్తున్నారు. పట్టణానికి చెందిన ఎస్వీఎల్ నారాయణ ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం వేళల్లో పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా ఈ వేద గణితాన్ని బోధిస్తున్నారు. ఈ పద్ధతిలో గణితాన్ని నేర్చుకుంటే క్యాల్క్యులేటర్తో సమానంగా సమాధానాలు సాధించవచ్చని ఆయన తెలిపారు.