Districts Agitation: ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియ కొనసాగిస్తుండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మా ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కొన్నిచోట్ల ఆందోళనలు కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలను వేరే జిల్లాలో కలపాలని నిరసనలు చేపడుతున్నారు.
ప్రకాశం జిల్లాలో...
మార్కాపురాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన రీలే నిరాహార దీక్ష నేటితో 15వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్న మార్కాపురాన్ని జిల్లా చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. ఈ దీక్షకు తెదేపా నాయకులు సంఘీభావం ప్రకటించారు.