KALYANAM: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో కొండపై వెలసిన శ్రీనివాసుని కల్యాణం బుధవారం వైభవోపేతంగా జరిగింది. స్వర్ణాలంకరణ భూషితుడై ఉభయ దేవతలతో కొలువుదీరిన స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కళ్యాణ మూర్తులను మండపంలో కొలువుదీర్చి కళ్యాణ కట్టని ప్రారంభించారు.
దివి వెంకట శేషాచార్యుల ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు నిర్వహించగా.. కళ్యాణ ఘట్టాన్ని వెంకటాచార్యులు, రాజశేఖర్ ఆచార్యుల సమక్షంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. స్వర్ణ శోభితాలంకరణలో స్వామి వారిని తిలకించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు సుమారు లక్ష మందికి పైగా తరలివచ్చారు. కల్యాణం అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం ఈవో లీలాకృష్ణ పర్యవేక్షణలో జరిగింది. ఉత్సవానికి వచ్చిన భక్తులకు శీతలపానీయాలు, మజ్జిగ, పళ్లరసాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.