ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో పడమటి కనుములకు దగ్గరగా కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం కొత్తపల్లి సమీపంలో కాలభైరవుడి ఆలయం ఉంది. సహజ ప్రకృతి సోయగాలతో ఆ ప్రాంతం విరాజిల్లుతోంది. క్రీ.శ. 6వ శతాబ్దంలో చోళులు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ఆకాశం నుంచి జాలువారే జలపాతం
భైరవ కోనలో సహజ సిద్ధంగా కనిపించే జలపాతం అక్కడికి వచ్చే భక్తులు, యాత్రికులను కనువిందు చేస్తుంది. సుమారు 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ప్రధాన ఆకర్షణ ఏడాది పొడవున కొండ శిఖరాల నుంచి జాలు వారుతున్న జలం మనుస్సు ఆహ్లాదాన్ని కల్గిస్తుంది. ఔషద గుణాలు కల్గిన ఈ నీటిలో స్నానం చేస్తే పలు దీర్ఘాకాలిక వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం కనీసం స్నానం చేయకపోయిన అక్కడ ప్రవహించే నీటిని తలపై చల్లుకుంటారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున జలపాతం నీటితో జాలువారుతూ అలరిస్తుంది.
ఒకే రాతిపై ఎనిమిది ఆలయాలు
అద్భుత శిల్పసంపదకు నెలవు భైరవకోన. ఎనిమిది ఆలయాలు ఒకే రాతిపై మలిచిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవాలయాల ముఖ ద్వారాల వద్ద త్రిమూర్తుల విగ్రహాలు.. కొండ ముఖ ద్వారం వద్ద బ్రహ్మ, విష్ణు, శివుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వినాయకుడు, చండేశ్వరుడు, బసవేశ్వరుడు, సూర్యుడు, చంద్రుడి విగ్రహాలు ఇక్కడి ప్రత్యేకత. ఏడు ఆలయాలకు కింద భాగంలో ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆలయం నిర్మించారు. సరస్వతి, లక్ష్మీపార్వతి దేవతల త్రిముఖాల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి.
అదే అద్భుతం
కార్తిక పౌర్ణమినాడు నిండు చంద్రుని కిరణాలు అమ్మవారి ఆలయం పక్కన ప్రవహిస్తున్న నీటిపై పడి అమ్మవారిపై.. ప్రతిబింబించడం అద్భుతమని భక్తులు అంటున్నారు. జలపాతం అందాలను తిలకించేందుకు భక్తుల తాకిడి పెరిగింది. ప్రకాశం, నెల్లూరు, కడప, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారాంతాల్లో భక్తులు, యాత్రికుల సంఖ్య అధికంగా ఉంటుంది.
ఇదీ చదవండి
ఇది హోటల్ కాదు గురూ.. పోలీస్‌స్టేషన్