ప్రకాశం జిల్లాలోని పొదిలి ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో 10 మంచి నీటి చెరువులు ఉన్నాయి. వాటి నుంచి 696 గ్రామాల్లోని 7,38,746 మందికి నీరు సరఫరా చేస్తున్నారు. చెరువుల సామర్థ్యాన్ని బట్టి మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇస్తుండటంతో సరిపోవడం లేదు. 5 నియోజకవర్గాల్లో 26 మండలాలు ఉన్నాయి. 12,833 చేతి పంపులు ఉండగా 6360 మాత్రమే పని చేస్తున్నాయి. 890 డీప్‌బోర్లకు 682 మాత్రమే పని చేస్తున్నాయని లెక్కల్లో చూపించడం తప్ప నీరిచ్చేవి తక్కువ. ఏడాది తరబడి ట్యాంకరు నీటిపైనే ఆధారపడే గ్రామాలు అనేకం.
దర్శి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలలో 232 గ్రామాలకు రోజుకు 2,556 ట్రిప్పుల నీటిని అందిస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.400 చెల్లిస్తున్నారు. భూగర్భ జలాలు ఉండటంతో కనిగిరి నియోజకవర్గంలో ఇంకా ట్యాంకర్లు ఏర్పాటు చేయలేదని అధికారులు చెబుతున్నారు. బోర్ల నుంచి వచ్చే నీరు ఫ్లోరైడ్‌తో కూడినది కావడంతో వాటిని తాగినవారు అనారోగ్యానికి గురవుతున్నారు. నగదు చెల్లించి మినరల్ వాటర్ తాగుదామన్నా అనుమతులు లేకుండా ఎవరికివారు ఏర్పాటుచేసి ప్రమాణాలు పాటించకపోవడం, రసాయనాలు ఎక్కువగా కలుపుతుండటంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
సాగర్ నీరూ అందక..
దొనకొండ మండలం వరకే తీసుకుంటే చందవరం-1, 2, లక్ష్మీపురం మూడు చెరువుల నుంచి 186 గ్రామాలకు నీటి సరఫరా ఉంది. సాగర్ కాలువ రెండు నెలలు వస్తే ఈ చెరువులను నింపుతారు. జనాభా పెరగడంతో సరఫరా సరిపోవడం లేదు. పైపులైన్లు మరమ్మతులకు గురైన చోట బాగుచేయకుండా వదిలేయడంతో కొన్ని గ్రామాలకు నీరు వెళ్లడం లేదు. కాలువ పక్కన ఉన్న పంచాయతీ, ఇరిగేషన్ చెరువులను నింపినా ఫలితముండేది. అయిదేళ్ల క్రితం పది మంచి నీటి చెరువులు నిర్మించేందుకు రూ.700 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపించారు. పట్టాలెక్కలేదు. ఈ మండలంలో వారానికి ఒకసారి నీరొచ్చే గ్రామాలు అనేకం. సరిపోనివారు సంపుల్లో అడుగు నీటినే తోడుకుంటున్నారు. కొచ్చెర్లకోట, అనంతవరం, గంగదేవిపల్లి, కలివెలపల్లి, వద్దిపాడు, సంగాపురం వాసులు ట్యాంకర్లపైనే ఆధారపడ్డారు.