Veligonda Project Expats: శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాల వినియోగానికి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆ నీటిని నిల్వ చేసేందుకు నల్లమల కొండల మధ్య సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల ప్రాంతాల వద్ద ఆనకట్టలు కట్టారు. అందులో 43.5 టీఎంసీల నీటిని నింపేందుకు వీలుగా నల్లమల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు టన్నెళ్లను ఎప్పటి నుంచో తవ్వుతున్నారు. ఈ జలాశయంలో నీళ్లు నింపితే ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు, మార్కాపురం, అర్థవీడు మండలాల్లోని 11 గ్రామాలు ముంపులో చిక్కుకుంటాయి. అక్కడి వారికి పునరావాస ప్యాకేజీ నిధులను అధికారులు ఇవ్వడం లేదు. గ్రామాలను ఖాళీ చేయిస్తాం అంటున్నారేగానీ తేల్చడం లేదు.
పుష్కరకాలంగా సొంత ఊళ్లల్లో ఎలాంటి వసతులూ లేకుండానే నిర్వాసితులు ఈసురోమంటూ జీవనం సాగిస్తున్నారు. 2022 ఆగష్టుకు వెలిగొండ నీళ్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 11 ముంపు గ్రామాల్లో మొత్తం 4వేల617 నిర్వాసిత కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2019 ఆగస్టు నాటికి 18 ఏళ్ల వయసు నిండినవారికి ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ లెక్కన మరో 2వేల938 మంది అర్హులయ్యారు. వీరందరికీ ఏక మొత్త పరిష్కారం కింద ఒక్కొక్కరికి పన్నెండున్నర లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అందరికీ అందలేదని నిర్వాసితులు వాపోతున్నారు.