ప్రకాశం జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, రాష్ట్ర రహదారుల నిర్వహణ, నిర్మాణాలకు ఇప్పటికి పలుమార్లు టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. గత ఏడాది జిల్లాలో రహదారుల నిర్మాణానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆ మేరకు స్పెషల్ రిపేర్స్ క్రింద ఎస్ఈ పరిధిలో 51 పనులు, ఇఎన్సీ పరిధిలో 10 పనులు మంజూరయ్యాయి. రెండు కోట్ల రూపాయల లోపు పని ఎస్ఈ.. రెండుకోట్ల పైబడిన పనులను ఈఎన్సీ.. ఆమోదంతో టెండర్లు పిలుస్తారు. ఈ రెండు పనుల కోసం రూ. 84.35 కోట్ల నిధులకు ఆమోదం లభించింది.
సర్కిల్ పరిధిలోని రహదారులకు రెండు సార్లు, ఈఎన్సీ పరిధిలో పనులకు మూడు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ స్పందించలేదు. మొత్తం 61 రహదారుల్లో కేవలం 4 దారులకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. అవి కూడా ఇంకా ప్రారంభం కాలేదు. బిల్లులు సక్రమంగా వస్తాయనే నమ్మకం లేకపోవడం, గతంలో చేసిన పనులకు సైతం బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతుండటంతో గుత్తేదారులు కొత్తపనులకు టెండర్లు వేయడంలేదని తెలుస్తుంది.
అంచనాలు మారుతున్నాయి..
గత ఏడాది పనులు గాబట్టి అదే నిధులతో ఆయా రోడ్లు పనులు ప్రారంభిస్తే అంచనాలకు తగ్గట్టు రహదారుల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉండేది. కానీ ఆర్థిక సంవత్సరం ముగియడంతో కొత్త ధరలు ప్రకారం రోడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్టాండర్స్ షెడ్యూల్ రేట్స్ (ఎస్.ఎస్.ఆర్) ప్రకారం అధికారులు అంచనాలు సవరిస్తున్నారు.. అయితే ఒక సారి ఆర్థిక శాఖ ఆమోదం పొంది, నగదు కేటాయింపు జరిగిన తరువాత నిర్మాణ వ్యయం పెంచడానికి నిబంధనలు అంగీకరించవు.