శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నిర్మితమైన ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు ప్రపంచ గుర్తింపు పొందింది. దాదాపు 30 అడుగుల లోతు.. 3.5 TMC ల నిల్వ సామర్థ్యంతో.. ఈ చెరువుని నిర్మించారు.
అడవుల నుంచి వచ్చే నీరు వడిసిపట్టి..
ఈ చెరువు మధ్యలో సుమారు 22 కొండలున్నాయి. నల్లమల అడవుల నుంచి వచ్చే నీటిని.. నిల్వచేసి, సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉపయోగించేవారు. చెరువు కట్టపై నుంచి చూస్తే కనుచూపు మేర నీళ్లు, పచ్చని కొండలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కానీ.. పరిరక్షణ విషయంలో మాత్రం ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. ఫలితంగా చెరువులో పూడిక పెరిగిపోయి.. పిచ్చి మొక్కలు ఎక్కువయ్యాయి. చెరువుకు ఉన్న రెండు తూములు బలహీనపడి శిథిలావస్థకు చేరుకున్నాయి.
పర్యాటకంగానూ..
ఏళ్ల చరిత్ర కలిగిన కంభం చెరువును చూసేందుకు, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు నిత్యం అక్కడకు పర్యాటకులు వస్తుంటారు. సందర్శకులకు మౌలిక వసతుల కల్పన, బోటింగ్, చెరువు మధ్యలో ఉన్న కొండలపై రిసార్ట్స్ వంటి వాటి నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నా... అవి కార్యరూపం దాల్చలేదు. చెరువు కట్టపై దేవాలయాలు, ఒక దర్గా కూడా ఉంది. ఏటా అక్కడ ముస్లింలు అక్కడ తేజతేరి పండుగను నిర్వహిస్తారు. కానీ అక్కడ కనీస వసతులు లేకపోవటం బాధాకరం. గతంలో అక్కడ నిర్మించిన అతిథి గృహం.. వసతులు లేక నిరుపయోగంగా మారింది.
మౌలిక వసతుల జాడేది?
చెరువుకి వచ్చే మార్గం కూడా సరిగా లేదని సందర్శకులు చెబుతున్నారు. మాములు సమయంలోనే వందల మంది పర్యాటకులు చెరువును చూసేందుకు వస్తారని స్థానికులు అంటున్నారు. చెరువు వద్ద మౌలిక వసతులు కల్పించి.. ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా విరజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కంభం చెరువును కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
ఎలా బతికేది.. నలుగురు ఆడపిల్లల్లో ఇద్దరూ అలాంటివారే..!