ప్రకాశం జిల్లాకు చెందిన లక్ష్మీ సుజాత, విజయలక్ష్మి అక్కాచెల్లెళ్లు. సుజాత ఎమ్ఏ బీఈడీ చేసి.... హైదరాబాద్‌లో ప్రైవేట్ విద్యా సంస్థలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విజయలక్ష్మి మాత్రం నాగులప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో నివాసముంటున్నారు. ఆమె భర్త రైతు కావడంతో ఆయనకు సహకరిస్తూ వ్యవసాయంలో మెళకువలు నేర్చుకున్నారు. సుజాత ఉన్నత చదువులు చదివినా సాగుపై మక్కువతో సొంతూరు వచ్చి వ్యవసాయం చేయాలని భావించారు. ఏడేళ్ల క్రితం ఇళ్లపావులూరు, జి.గుడిపాడు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. ఇళ్లపావులూరులో కొండకు దిగువున ఉన్నవన్నీ బీడు భూములే. రాళ్లు రప్పలతో సాగుకు ఏమాత్రం పనికిరాకుండా ఉండేవి. ఈ సోదరీమణుల చొరవతో.... అలాంటి భూములు ఇప్పుడు పండ్ల తోటలతో పచ్చగా కళకళలాడుతున్నాయి.
బీడు భూమిని చదును చేసి దానిమ్మ, జామ, బొప్పాయి పండించేవారు. తర్వాత కావ్య ఫామ్స్ పేరుతో వ్యవసాయ పరిశ్రమగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యాన పంటలపై దృష్టి పెట్టారు. బిందుసేద్యం చేస్తూ... ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేస్తున్నట్లు చెబుతున్నారు. -లక్ష్మీ సుజాత, రైతు